కొండాపూర్, సెప్టెంబర్ 26 : ఓ వ్యక్తి ఏకంగా చెరువులో నిర్మించిన భవనాన్ని గురువారం అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. కొండాపూర్ మండలం మల్కాపూర్ మధిర గ్రామం కుతుబ్షాయిపేటలోని మల్కాపూర్ పెద్ద చెరువులో పటాన్చెరుకు చెందిన నర్సింలు అనే వ్యక్తి 2011లో మూడు ఎకరాలు కొనుగోలు చేశాడు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే 2012లో నాలా కన్వర్షన్ చేసుకొని 250 గజాల విస్తీర్ణంలో జీ+2 భవనాన్ని నిర్మించాడు. అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని గతంలో ’నమస్తే తెలంగాణ’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. అప్పట్లో ఆ భవన యజమాని కోర్టు స్టే తీసుకువచ్చినట్టు ప్రచారం జరిగింది.
దీంతో ఆ నిర్మాణం అలాగే ఉండిపోయింది. విషయం సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించారు. కొండాపూర్ మండల రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించి ఈ నిర్మాణం ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నదని తేల్చి కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. భవనాన్ని కూల్చివేయాలని అధికారులు సదరు భవన యజమానికి వారం రోజుల క్రితం నోటీసులు జారీచేసినా స్పందించలేదు.
దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య భవనాన్ని తహసీల్దార్ ఎస్తేరు అనిత, ఇతర అధికారులతో కలిసి పేలుడు పదార్థాలతో కూల్చివేశారు. ఈ క్రమంలో భవన శకలం తగలడంతో ఇంద్రకరణ్ పోలీస్స్టేషన్ హోంగార్డు గోపాల్ తలకు గాయమైంది. అక్కడే ఉన్న అధికారులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. తన భవనం ఎఫ్టీఎల్లో ఉన్నట్లు తెలియదని అన్నారు. తాను నిర్మాణం చేపట్టినప్పుడు నీళ్లు లేవని చెప్పాడు. ఎఫ్టీఎల్లో భవన నిర్మాణాలకు అనమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ తీరువల్ల తనకు రూ.6 కోట్లకుపైగా నష్టం వాటిలినట్టు వాపోయాడు.