Revanth Reddy | జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో నేను హైడ్రా తెచ్చిన. హైడ్రాఅనేది హిట్లర్ ఫేవరేట్ పదం. హిట్లర్‌కు ఉన్నకోర్ టీమ్ పేరు హైడ్రా. హైడ్రా అంటే ఎవరినైనా అంతం చేయొచ్చని అర్థం. కాబట్టి, నేనుహిట్లర్ను ఆదర్శంగా తీసుకొని ఈ వ్యవస్థకు హైడ్రా అని పేరు పెట్టిన..
– జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ శనివారం బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
(స్పెషల్ టాస్క్బ్యూరో) హైదరాబాద్, జూన్ 6(నమస్తే తెలంగాణ): ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంతగా ముద్రపడిన అడాల్ఫ్ హిట్లర్ తనకు ఆదర్శమని, ఆయన కోర్ టీమ్ పేరు మీదుగానే హైడ్రా ఏర్పాటుచేశానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగంగా అంగీకరించడం అనేక విమర్శలకు దారితీస్తున్నది. తనకు తాను హిట్లర్‌గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి విఫలయత్నం చేసిన రేవంత్ చివరకు జాతీయ మీడియా ఎదుట బొక్కబోర్లాపడ్డారు. హెచ్చులకు పోయి నెటిజన్ల చేతికి చిక్కి విపరీతంగా ట్రోల్స్‌కు గురవుతూ నవ్వులపాలయ్యారు. జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ శనివారం బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో తెలంగాణలో హైడ్రా ఏర్పాటుపై యాంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన రేవంత్.. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో తాను హైడ్రాను తీసుకొచ్చినట్టు చెప్పారు. ‘హైడ్రా అనేది హిట్లర్ ఫేవరేట్ పదం. హైడ్రా అంటే ఎవరినైనా అంతం చేయొచ్చని అర్థం. హిట్లర్‌కు ఉన్న కోర్ టీమ్ పేరు హైడ్రా. ఆ టీమ్ ఎవరినైనా అంతం చేయగలదు. కాబట్టి, నేను హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకొని ఈ వ్యవస్థకు హైడ్రా అని పేరు పెట్టాం’ అంటూ రేవంత్ నవ్వులు చిందించారు. అక్రమారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలనే ఉద్దేశంతోనే ఈ నియంతృత్వ కోణాన్ని సీఎం ప్రస్తావించినప్పటికీ, ఆయన చెప్పిన హిస్టరీ పూర్తిగా తప్పని తేలిపోవడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

‘ది హిందూ’ డైరెక్టర్ ఎన్ రామ్‌తో సీఎం రేవంత్ రెడ్డి
హిట్లర్ కోర్ టీమ్ పేరు హైడ్రా అంటూ చేసిన రేవంత్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని మేధావులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండి, కనీస చరిత్ర తెలియకుండా హాలీవుడ్ కల్పిత కథలను నిజమని నమ్మడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు చరిత్రలో హిట్లర్‌కు ‘హైడ్రా’ అనే కోర్ టీమ్ లేదు. అది ఆయనకు ఇష్టమైన పదమూ కాదు. ‘మార్వెల్ కామిక్స్’, ‘కెప్టెన్ అమెరికా’ సినిమాల్లో సృష్టించిన ఒక కల్పిత ఉగ్రవాద విలన్ ఆర్గనైజేషన్ పేరు ‘హైడ్రా’. ఆ ఫిక్షనల్ స్టోరీలో దీనిని నాజీలకు అనుసంధానించి చూపించారు. ఆ సినిమా కథను నిజమైన చరిత్ర అనుకొని సీఎం రేవంత్‌రెడ్డి భ్రమపడ్డారంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. గ్రీకు పురాణాల ప్రకారం.. హైడ్రా అనేది చెడుకు సంకేతం. రాక్షసుల పెంపుడు జంతువు పేరు ‘హైడ్రా’. దానికి పలు తలలు ఉంటాయి. ఒక్క తలను నరికేస్తే, రెట్టింపు తలలు కొత్తగా పుట్టుకొస్తాయి. ‘ఎంతకీ పరిష్కారం కాని సమస్య’కు సంకేతంగా హైడ్రాను సూచిస్తారు. జర్మనీకి చెందిన హిట్లర్, గ్రీక్ పేరును తన కోర్ టీమ్‌కు పెట్టుకుంటాడా? ఇంత చిన్న లాజిక్ రేవంత్‌రెడ్డి ఎలా మిస్ అయ్యారు? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అటువంటి హైడ్రా పేరుతో బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నానంటూ రేవంత్ గొప్పగా చెప్పుకోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. ‘ఎవరైనా మంచి పాలకులను ఆదర్శంగా తీసుకొంటారు. ప్రపంచ యుద్ధానికి కారణమై, కోట్ల మంది చావుకు కారణమైన హిట్లర్ వంటి క్రూరమైన నియంతను ఎవరైనా రోల్ మాడల్‌గా తీసుకొంటారా?’ అంటూ మండిపడుతున్నారు. పైగా హిట్లర్ ఏమాత్రం బలమైన నేత కాదని, శత్రువుల భయంతో బంకర్లలో దాక్కొని, చివరకు ఆత్మహత్య చేసుకొన్న పిరికివాడని గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొన్న రేవంత్‌ను ఏమనాలి? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిని బయటపెడుతున్నాయంటూ ఎద్దేవా చేస్తున్నారు.
గతంలో హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వచ్చినప్పుడు.. ‘భగవద్గీత స్ఫూర్తితోనే హైడ్రాను తీసుకొచ్చాం, దుష్టశిక్షణ-శిష్టరక్షణే మా లక్ష్యం’ అని సీఎం రేవంత్‌రెడ్డి సెలవిచ్చారు. తాజాగా ఇప్పుడు ‘హిట్లర్ నాకు ఇన్స్పిరేషన్.. అందుకే హైడ్రా పేరు పెట్టాం’ అనడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. అసలు హైడ్రాకు స్ఫూర్తి భగవద్గీతా? లేక హిట్లరా? అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. చెరువుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన ఒక ప్రభుత్వ వ్యవస్థకు.. శాసనబద్ధమైన అధికారాలు, నిబంధనలు కాకుండా, ఒక వైపు హిట్లర్ లాంటి క్రూర నియంతను ఆదర్శంగా చెప్పడం, మరోవైపు సినిమా కథలను నిజం అనుకుని మాట్లాడటం సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని రాజకీయ పండితులు
విమర్శిస్తున్నారు.