HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 18 (నమస్తే తెలంగాణ ): హైడ్రా ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్‌లపై ఫోకస్ పెట్టిందా? చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన అకాశహర్మ్యాలను నేలమట్టం చేయాలని భావిస్తున్నదా? అంటే అవుననే అంటున్నాయి హైడ్రా వర్గాలు. విపత్తు నిర్వహణ, ఆస్తుల రక్షణకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గడచిన కొంత కాలంగా చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, జంట జలాశయాల ఎఫ్టీఎల్లోని కట్టడాలను, పార్కు స్థలాల్లో 262 నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాలు స్వాధీనం చేసుకున్నది. 23 చోట్ల జరిపిన ఈ కూల్చివేతల్లో సామాన్యుడిపైనే హైడ్రాప్రతాపం చూపిందంటూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ఆపవాదు నుంచి బయటపడేందుకు ఓ ప్రముఖ సంస్థనిర్మాణాలను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు.
బాచుపల్లిలోని కోమటికుంట చెరువు (లేక్ ఐడీ నంబర్ 2822) ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమంగా 8, 9వ బ్లాక్ నిర్మాణ పనులు చేపడుతున్న నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. హైడ్రా అధికారుల బృందం ఇటీవల సంబంధిత నిర్మాణ సంస్థ చేపడుతున్న స్థలాన్ని పరిశీలించింది. ఎఫ్టీఎల్, బఫర్జోన్లలోనే 8,9వ బ్లాక్‌లు కడుతున్నట్టు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ సం స్థకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ బ్లాక్‌ల నిర్మాణం నిలిపివేయాలని ఆదేశించి నా ఆ సంస్థ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే లీగల్ సమస్యలు తలెత్తకుండా హైడ్రా నిశితంగా పరిశీలన చేస్తున్నది. 20వ తేదీ తర్వాత హైడ్రా విధివిధానాలు పూర్తిగా ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఈ వారాంతంలో సదరు సంస్థపై చర్యలు తీసుకునే దిశగా బృందాలు రెడీ అవుతున్నట్టు ప్రచారం.