హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు వంశీరాం బిల్డర్స్ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కదిలారు. వంశీరాం బిల్డర్స్ కొత్తకుంట చెరువులో వేసిన మట్టిని తొలగించాలంటూ నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో హైడ్రా కమిషనర్ మంగళవారం కాజాగూడలోని కొత్తకుంట (నానక్రామ్కుంట)ను సందర్శించారు. కొత్తకుంట ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మూడు, నాలుగు రోజుల్లో మట్టిని తొలగించాలని వంశీరాం బిల్డర్స్‌ను ఆదేశించారు.
ఈ నెల 14న అనిరుధ్‌రెడ్డి అసెంబ్లీలో చిట్‌చాట్ చేస్తూ, హైడ్రాపై హాట్ కామెంట్స్ చేశారు. తాను వంశీరాం బిల్డర్స్పై హైడ్రాకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని, దీనిపై అసెంబ్లీ జీరో అవర్‌లో ప్రస్తావిస్తానని అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు. దీనిపై హైడ్రా స్పందిస్తూ, తనకు ఎమ్మెల్యే నుంచి వంశీరాం విషయంలో ఫిర్యాదే అందలేదని ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు చేస్తున్నదని, వంశీరాం విషయంలో ముఖ్యమంత్రిని కలిసి మరోసారి ఫిర్యాదు చేస్తానని అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు. గత సంవత్సరం ఆగస్ట్, డిసెంబర్ నెలల్లో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇచ్చిన రెండు ఫిర్యాదులు తౌతానికుంటకు సంబంధించినవేనని, వంశీరాం మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని హైడ్రా కమిషనర్ అదేరోజు ప్రకటించారు.
ఇలా అనిరుధ్‌రెడ్డి నుంచి తమకు ఫిర్యాదే అందలేదంటూ చెప్తూ వచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. సోమవారం నుంచి వంశీరాం బిల్డర్స్ విషయంలో, అనిరుధ్‌రెడ్డి ఫిర్యాదుపై స్వరం మా ర్చారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో రంగనాథ్ చిట్‌చాట్ చేస్తూ, అనిరుధ్‌రెడ్డి ఫిర్యాదుపై స్పందించి ఖాజాగూడ కొత్తకుంట చెరువులో మట్టి తొలగించాలంటూ పలు సంస్థలకు నోటీసులిచ్చామని చెప్పారు. తాజాగా మంగళవారం కమిషనర్ ప్రకటనలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు వంశీరాం బిల్డర్స్‌కు నోటీసులిచ్చామని పేర్కొన్నారు. ఇంతకుముందు ఏ ప్రకటనలోనూ అనిరుధ్‌రెడ్డి నుంచి వంశీరాంకు సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని పేర్కొన్న హైడ్రా.. ఇప్పుడు ఎందుకు ఇలా గొంతు సవరించుకున్నదనే చర్చ ప్రజల్లో జరుగుతున్నది.