HYDRA | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఫిలింనగర్లో లోటస్‌పాండ్ పార్కు స్థలం కాంపౌండ్ వాల్ కూల్చివేత మొదలు.. శనివారం మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం సహా 18 చోట్ల కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. 43.94 ఎకరాలకు విముక్తి కల్పించింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఆదివారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. విపత్తు నిర్వహణ, ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో కొనసాగుతున్నది. హైడ్రా రోజుకు 40 నుంచి 50 వరకు అక్రమ కట్టడాలు, కబ్జాలపై ఫిర్యాదులను స్వీకరిస్తున్నది. రంగంలోకి దిగి ఆయా కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో వెలిసిన నిర్మాణాలను కూల్చివేసి 43.94 ఎకరాలకు విముక్తి కల్పించినట్టు హైడ్రా కమిషనర్ తన నివేదికలో పేర్కొన్నారు.
కూల్చివేతల్లో ప్రముఖుల నిర్మాణాలు
లోటస్‌పాండ్, మన్సురాబాద్, బంజా రాహిల్స్, జూబ్లీహిల్స్, గాజుల రామా రం, బాచుపల్లి, చందానగర్, రాజేంద్రనగర్, ఆమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వివిధ నిర్మాణాలను నేలమట్టం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇందులో పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ అధినేత జీవీ భాస్కర్‌రావు, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సునీల్‌రెడ్డి, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ, సినీ నటుడు నాగార్జున, బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు తదితరుల నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. నందగిరి హిల్స్‌లో కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో హైడ్రా అధికారులు కేసు నమోదు చేశారు. జంట జలాశయాల పరిధిలో కట్టడాలను హైడ్రా కూల్చివేయడం, పరిధి దాటి చర్యలకు దిగడం పట్ల హైడ్రాపై విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం మాత్రం హైడ్రా పరిధిని మరింత విస్తరించి 111 జీవో పరిధిలో దృష్టి సారించిందన్న చర్చ జరుగుతున్నది.