HYDRA | మేడ్చల్, మే 22 (నమస్తే తెలంగాణ) : వారంతా పొట్టచేత పట్టుకొని బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన నిరుపేదలు. ఊరిలో ఉన్న కొద్దిపాటి భూములను అమ్ముకొని పిల్లల భవిష్యత్తు కోసం కొన్నేండ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా హైడ్రా అధికారులు, సిబ్బంది వారి ఇండ్లపైకి దండెత్తారు. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో జోరువాన కురుస్తున్నా నిరుపేద బతుకులపై కనికరం చూపలేదు. రెండు రోజులు సమయం ఇవ్వాలని వేడుకున్నా వినకుండా నిరుపేదల నిర్మాణాలను కూల్చివేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఫీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో అనుమతులు ఉన్న ఐదు నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనతో ఐదు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అనుమతులు ఉన్నాయని, ఐదేండ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రభుత్వానికి అన్ని పన్నులు కడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించినా అధికారులు పట్టించుకోకుండా పోలీసులతో వారిని నెట్టివేయిస్తూ నిర్మాణాలను బుల్డోజర్తో కూల్చివేశారు. ఇంట్లో ఉన్న సామాన్లు తీ సుకునే సమయం ఇవ్వాలని కోరినా నిరాకరించి నిర్మాణాలను కూల్చడంతో గుండెలు బాదుకుంటున్నారు.
తమకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఇండ్లు కూల్చివేసిన ప్రభుత్వంపై బాధితులు దుమ్మెత్తిపోశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరుపేదలకు ఒక న్యాయం బాడాబాబులకు మరో న్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇదే సర్వే నంబర్లో బడా బాబుల బిల్డింగ్లు ఉన్నాయని, వాటి జోలికి హైడ్రా అధికారులు ఎందుకు పోవడం లేదని నిలదీశారు. తాము ఎంత మొత్తుకుంటున్నా అధికారులు వినకుండా కూల్చివేతలను కొనసాగించడంతో రేవంత్ సర్కారుపై బాధితులు ఆక్రోశం వెల్లగక్కారు. సొంత గ్రామాల్లో భూములు అమ్ముకొని ఇక్కడ కష్టపడ్డ డబ్బుతో కొనుక్కున్న స్థలాల్లో ఇండ్లు కట్టుకున్నామని, ఇప్పుడు కూల్చివేస్తే తాము ఎట్లా బతకాలని ఓ వృద్ధుడు అధికారులను ప్రాధేయపడ్డారు. వారు వినకపోవడంతో ఆగ్రహంతో అధికారులకు అడ్డుపడ్డాడు. దీంతో హైడ్రా సిబ్బంది దౌర్జన్యంగా ఆ వృద్ధుడిని లాక్కెళ్లి హైడ్రా వాహనంలో పడేశారు. స్థానికులు ‘ఆయనను ఎందుకు బండెక్కిస్తున్నరు? ఆ పెద్దమనిషి ఏం చేసిండని తీస్కపోతున్నరు? ఆయనకేమన్న అయితే ఎవరిది బాధ్యత?’ అంటూ ఆగ్రహంతో అడ్డుపడడంతో వృద్ధుడిని వాహనంలోంచి దించారు. కాగా అప్పటికే ఆ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు.
ఆరెకరాలు అమ్ముకచ్చి దీనిమీద పెట్టిన. అంతా నాశనం చేసిండు. వచ్చిన కాన్నుంచి అంతా నాశనం చేస్తున్నడు. ఊళ్లె ఉన్నది అమ్ముకచ్చిన.. తిండితిప్పల్లేకుండ బతికిన. పోరగాండ్లను సాదేటోళ్లు లేరు.. మా లాంటోళ్లను ఆగం జేస్తె ఏమస్తది? నా పిల్లల ఉసురు వాళ్లకు తాకుతది.
ఊర్లె భూమి అమ్ముకొని వచ్చినం. పిల్లల భవిష్యత్తు కోసం ఈడికి వచ్చి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి షెడ్డు కట్టుకున్నం. 30 ఏండ్ల నుంచి ఇక్కడ మంచిగ ఉన్నం. ఇప్పుడు కూలగొట్టిండు. నోటీసు లేదు బీటీసు లేదు. కరెంటు బిల్లు ఉన్నది. ఇల్లు ట్యాక్సు కడుతున్నం. అన్ని పర్మిషన్లు తీసుకున్నం. మేము కొనుక్కున్నప్పుడే అధికారులు ఇట్లా అని చెప్పి ఉంటే అప్పుడే కొనకపోయేటోళ్లం. ఓ దిక్కు వాన పడుతుంటే అంతా సర్దుకొని పోవాల్నని చెప్పిండ్రు. గీ వానల పొమ్మంటె ఎటు పోతం సారూ?