హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): హైడ్రా అనేది ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థ అనీ, రియల్ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్లు.. ప్రత్యేకించి బిల్డర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, హైడ్రా వచ్చిన తర్వాత ఓఆర్ఆర్ లోపల ప్రాంతంలోని ప్రతీ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. తేడాలుంటే కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో బిల్డర్లు గతంలో ఎక్కడపడితే అక్కడ నిర్మాణాలు చేశారని, వర్టెక్స్, వాసవి లాంటి సంస్థల భవనాలను కూడా కూల్చేశామని, బిల్డర్లు సరిగా వ్యవహరించకపోతే ఊరుకునేదిలేదని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. ప్రధానంగా రేట్లు ఎక్కువగా ఉంటున్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి వంటిప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు వస్తున్నాయని, వాటిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని రంగనాథ్ చెప్పారు. హైడ్రా వచ్చిన తర్వాత చేపట్టిన నిర్మాణాలపై దృష్టి పెడుతూనే పాత అనుమతులను కూడా ఖచ్చితంగా పరిశీలిస్తామని, సర్వే నంబర్లు, కోర్టు నోటీసుల పేరుతో డ్రామా చేస్తున్నారని, అందుకే ఈ విషయంలో హైడ్రా సీరియస్‌గా వ్యవహరిస్తున్నదని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రియల్ఎస్టేట్లో అనుభవమున్న వ్యక్తి కావడంతో ఎక్కడెక్కడ ఎలా ఆక్రమణలు జరుగుతాయో ఆయన చెప్పారని, కూల్చివేతల విషయంలో ఆయన చెప్పినట్టే చేస్తున్నామని వెల్లడించారు.
పాతవాటికి మినహాయింపు ఇచ్చినట్టేనా!
వరంగల్‌లో గతంలో అధికారపార్టీ ఆక్రమణలను అడ్డుకున్నందుకే తనకు హైడ్రా కమిషనర్‌గా అవకాశమిచ్చినట్టు రంగనాథ్ చెప్పారు. మరోవైపు చెరువుల హద్దుల్లో మంత్రుల ఫామ్‌హౌస్‌లు, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు వంటి నిర్మాణాల కూల్చివేతల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి వ్యవహరిస్తున్నామని చెప్పారు. హైడ్రా మొదట్లో దూకుడుగా పనిచేసిందని, ఆ కూల్చివేతలతో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయని తెలిపారు. చాలామంది బిల్డర్లు తాము కోట్ల రూపాయలు నష్టపోయామని చెప్తున్నారని చెప్పినట్టు వెల్లడించారు. అలాగే డబ్బులు కట్టి కొనుక్కున్న ఇండ్లల్లో ఉండి, ఇప్పుడు ఇల్లు లేకుండా అయ్యామని సామాన్య ప్రజలు చెప్పారని వివరించారు. దీంతో ప్రభుత్వం లోతుగా ఆలోచించి, హైడ్రా ఏర్పడటానికి ముందు అనుమతులు ఉన్నవి కానీ, అప్పటికే అనుమతులు లేకుండా జరిగిన నిర్మాణాలను గానీ కూల్చేయవద్దని నిర్ణయం తీసుకున్నదని, కానీ కమర్షియల్‌గా వాడే వాటిని మాత్రం కూల్చేస్తామని తేల్చిచెప్పారు.
హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతులు, బ్యాంకు రుణాలు పొంది చేపట్టిన నిర్మాణాలను ఇప్పుడు కూల్చివేయలేమని, ఒకవేళ కూల్చితే.. వారు బిల్డర్లకు చెల్లించిన డబ్బులు ఎవరు తిరిగి చెల్లిస్తారని ప్రశ్నించారు. అందుకే వాటిని కూల్చివేయవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ దిశగానే హైడ్రా వ్యవహరిస్తున్నదని చెప్పారు. హైడ్రా తరపున ఎన్వోసి ఇవ్వబోమని, అందుకు వేరే సంస్థలు ఉన్నాయని తెలిపారు. నాలాల కబ్జాల విషయంలోనూ తమకు ఓ స్పష్టత ఉందని, నాలాలపై ఉన్న కమర్షియల్ నిర్మాణాలు తొలగిస్తామని, అవసరమైతే ఇండ్లను కూడా కూల్చివేస్తామని చెప్పారు.
రేట్లు తగ్గించండి.. అమ్మకాలు పెంచండి!
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ పడిపోవడానికి ఒకరకంగా హైడ్రా కూడా కారణం అయినప్పటికీ బయట నుంచి వచ్చే డబ్బులు రాకపోవడం, డిమాండ్ తగ్గి సప్లయి పెరిగినట్టు ఇండ్ల నిర్మాణాలు పెరిగి, కొనేవాళ్లు తగ్గిపోవడం లాంటి వేర్వేరు కారణాలు కూడా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోవడం వల్ల రియల్ఎస్టేట్ తగ్గిందని, ఎస్ఎఫ్టీ రూ.1500-రూ.20,000 వరకు ఉండడం మంచిది కాదని రంగనాథ్ చెప్పారు. ధరల వల్లే రియల్ఎస్టేట్లో స్తబ్ధత ఏర్పడిందని, ధరలు పెరగడం మంచిదే అయినా తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని చెప్పారు. ధర లు పెంచి అమ్మకాలు పడిపోతున్నాయంటే ఎలా? అని ప్రశ్నించారు. హైడ్రా వల్ల ఇప్పుడు ఎక్కడ ఇండ్లు కొనుక్కోవాలన్నా సామాన్యులు ఆలోచిస్తున్నారని, అంతేకాకుండా బ్యాంకులు కూడా లోన్లు జాగ్రత్తగా ఇస్తున్నాయని రంగనాథ్ తెలిపారు.
చీకట్లో కూల్చివేతలెక్కడివి!
కూల్చివేతలకు ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని, తమకు కూల్చాలని అనిపిస్తే… వాటిని ఎప్పుడైనా కూల్చివేయవచ్చని రంగనాథ్ స్పష్టంచేశారు. చీకట్లో కూల్చివేస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదని, తాము పగటిపూటే కూల్చివేతలు చేపట్టామని, ఉదయం ఏడుగంటలలోపు కూల్చివేతలు చేయలేదని… ఇదంతా అసత్యప్రచారం అని చెప్పారు. తెల్లవారుజామునే వెళ్లి, చీకట్లో అందరినీ బయటకు పంపుతున్నారని అనడం వాస్తవం కాదని తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం శనివారం, ఆదివారం అని ఏం పట్టింపులు లేవని, కూల్చివేతలు ఒక్క పండుగల్లో తప్ప ఎప్పుడైనా చేయవచ్చని రంగనాథ్ చెప్పారు.