హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క చెరువుకు నోటిఫికేషన్ ఇవ్వలేదని, హైదరాబాద్‌లోని 80% చెరువులకు హద్దులే నిర్ధారించలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కూల్చివేతల నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. హైడ్రా ఏర్పడిన కొత్తలో ఆ సబ్జెక్టు తమకు కొత్త అని, ఆ తర్వాత అనేక విషయాలు తెలుసుకున్నామన్నారు. ఫాతిమా కాలేజీ కూల్చివేతల విషయంలో దాతృత్వాన్ని చూడబోమని, పాతబస్తీలోని సల్కం చెరువు హద్దుల నిర్ధారణ జరగకుండా కూల్చివేతలు చేపట్టలేమని స్పష్టంచేశారు.
మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి విద్యాసంస్థల విషయంలోనూ అదే విధానాన్ని పాటిస్తున్నామ ని చెప్పారు. చెరువు ల హద్దులను నిర్ధారించేందుకు గ్రామా ల మ్యాప్‌లతోపాటు ఎన్ఆర్ఎస్సీ, సర్వే ఆఫ్ ఇండియా, గూ గుల్ మ్యాపులను, ఆయకట్టును పరిగణనలోకి తీసుకుని కసరత్తు చేస్తున్నామని వివరించారు. శనివారం టీయూడబ్ల్యూజే నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో రంగనాథ్ మాట్లాడుతూ.. హైడ్రా ఏర్పాటుకు ముందే చెరువుల హద్దుల్లో కట్టిన ఇండ్లను తొలగించబోమని, హైడ్రా ఏర్పాటు తర్వాత కట్టిన ఇండ్లను మాత్రమే కూల్చేస్తామని స్పష్టం చేశా రు.
ఇండ్ల యజమానులకు కొన్ని పరిస్థితుల్లో నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపడతామని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కూల్చివేతలకు ముందు నోటీసులు ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పారు. గండిపేటలో రాజకీయ నాయకుల నిర్మాణాలను కూల్చేశామని, హిమాయత్‌సాగర్ హద్దులను ఇంకా నిర్ధారించలేదని తెలిపారు.