శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 02:03:18

హైదరాబాద్‌ - విజయవాడ హైవేకు 500 కోట్లు ఇవ్వండి

హైదరాబాద్‌ - విజయవాడ హైవేకు 500 కోట్లు ఇవ్వండి

హైదరాబాద్‌ - విజయవాడ హైవేకు 500 కోట్లు ఇవ్వండి

నగరంలో 25కి.మీ. మేర  లేన్‌ కెపాసిటీ పెంచాలి 

లెవల్‌ జంక్షన్లు,  సర్వీస్‌ రోడ్లు లేక ఇబ్బందులు

మౌలిక వసతుల కల్పనలో సహకారం ఇవ్వండి 

కేంద్రమంత్రి గడ్కరీకి రాష్ట్రమంత్రి కేటీఆర్‌ లేఖ  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిలో ప్రస్తుతం ఉన్న సమస్యలను తొలిగించి, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యేకంగా రూ.500 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు.. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని కోరారు. ఈ మేరకు గురువారం కేంద్రమంత్రికి లేఖ రాశారు. నేషనల్‌ హైవే-65 హైదరాబాద్‌లో 25 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నదని పేర్కొన్నారు. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో జాతీయరహదారికి ప్రత్యేకంగా లెవల్‌ జంక్షన్లు, సర్వీసు రోడ్ల వంటి సౌకర్యాలు లేవని తెలిపారు. లేన్‌ కెపాసిటీ మరింతగా పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో హైవే అభివృద్ధికి రాష్ట్ర పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ రూ.500 కోట్లతో డీపీఆర్‌ తయారుచేసిందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. పెరుగుతున్న హైదరాబాద్‌ నగరం విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టిందని వివరించారు. హైదరాబాద్‌ నగరానికి నాలుగు అర్బన్‌ ప్రాజెక్టులు వచ్చాయని, అందులో మూడు ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే అంబర్‌పేట ఫ్లైఓవర్‌ పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు భూ సేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్‌ వంటి కార్యక్రమాలకు పూర్తిగా రాష్ట్ర నిధులను ఖర్చుచేస్తున్నామని గుర్తుచేశారు.

అత్యంత వేగంగా అభివృద్ధి

రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, భౌగోళిక అనుకూలతలతో హైదరాబాద్‌ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే అంతర్జాతీయస్థాయిలో అగ్రగామిగా ఉన్న గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, సేల్స్‌ఫోర్స్‌ తదితర సంస్థలు తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటుచేశాయని పేర్కొన్నారు. ఫార్మా, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ వంటి రంగాల్లో పెద్దఎత్తున తయారీరంగ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తోపాటు భవిష్యత్‌ అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మెట్రోరైల్‌ ప్రాజెక్టు పూర్తి చేసిందని, ఎస్సార్డీపీ కార్యక్రమాన్ని తీసుకొని ఫ్లైఓవర్లు, రైల్వే ఓవర్‌, అండర్‌ బ్రిడ్జిలను నిర్మించడంతోపాటు, పెద్దఎత్తున లింకు రోడ్ల సౌకర్యం కూడా కల్పించిందని లేఖలో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లు, మౌలికవసతులకు సంబంధించిన కార్యక్రమాలను పూర్తిచేశామని వివరించారు. ఇంత పెద్దఎత్తున రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పనకు ప్రోత్సాహం ఇచ్చేలా హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారికి రూ.500 కోట్లు కేటాయించాలని కోరారు.logo