హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్వహణ శనివారం నుంచి ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ చేతిలోకి వెళ్లింది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ఈ లీజు ప్రక్రియ పూర్తయింది. దీంతో 30 ఏండ్ల పాటు ఓఆర్ఆర్ నిర్వహణ, టోల్ వసూళ్లను ఐఆర్బీ చేపట్టనున్నది. రూ.7,380 కోట్లకు ఈ టెండర్‌ను దక్కించుకున్న ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. సదరు మొత్తాన్ని చెక్కు రూపంలో శుక్రవారమే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఆ వెంటనే హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ లీజును అధికారికంగా ఐఆర్బీకి అప్పగించింది. దీంతో ఓఆర్ఆర్పై శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచే ఐఆర్బీ సంస్థ పేరుతో టోల్ రసీదులను జారీ చేస్తున్నారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) మార్గదర్శకాల ప్రకారం ఎంతో పారదర్శకంగా పూర్తిచేశామని, తద్వారా వచ్చిన రూ.7,380 కోట్లను ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నదని అధికారులు తెలిపారు.
ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థకు దేశంలో ఇది రెండవ టీవోటీ ప్రాజెక్టని ఐఆర్బీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీరేంద్ర డి మైస్కర్ చెప్పారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టును ఐఆర్బీ చేపట్టేందుకు సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 158 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఓఆర్ఆర్పై వాహనదారులకు మెరుగైన సేవలను అందిస్తామని చెప్పారు.