హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నది. ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా పోలీస్స్టేషన్లను నిర్మిస్తున్నది. తెలంగాణకు గుండెకాయ వంటి రాజధానిలో పెరిగిన జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిని విస్తరించింది. ఇందులో భాగంగా కొత్తగా 13 పోలీస్స్టేషన్లు, 11 డివిజన్లు, 2 జోన్లను ఏర్పాటు చేసింది. ప్రతిజోన్లోనూ మహిళలకు ప్రత్యేకంగా ఒక పోలీస్‌స్టేషన్‌ను మంజూరు చేసింది. జోన్ల పునర్విభజన అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇక నుంచి 73 పోలీస్స్టేషన్లు, 28 డివిజన్లు, 7 జోన్లు ఉండనున్నాయి. పాత ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో కొన్ని ప్రాంతాలను కొత్త వాటిలో కలిపి నూతన పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేశారు. గతంలో 25 ఉన్న ట్రాఫిక్ ఠాణాలు ఇప్పుడు 31కి పెరిగాయి. వీటికి సంబంధించి ఇటీవలే అధికారుల కేటాయింపు కూడా పూర్తయింది. నిర్మాణ అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నది తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్.
తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం పోలీస్స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పన, ఆధునిక వాహనాల కొనుగోలుకు సంబంధించిన జీవోనే మొదట వెలువరించింది. దీన్నిబట్టే పౌరుల భద్రతకు కేసీఆర్ ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థమవుతుంది. కొత్తగా ఏర్పడిన 23 జిల్లాలకు జిల్లా పోలీస్ అధికారుల కార్యాలయాలు, వారి నివాస గృహాలు, ఇతర అనుబంధ కార్యాలయాలు, సిబ్బంది నివాస గృహాల బాధ్యతను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించారు. ప్రతి మండలానికి ఒక పోలీస్‌స్టేషన్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 137 పోలీస్స్టేషన్లకు కొత్త భవనాల నిర్మాణం చేపట్టగా 87 భవనాలు పూర్తయ్యాయి. మరో 50 భవనాల నిర్మాణం చివరి దశలో ఉన్నది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడిన 15 జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలకు తోడు సిద్దిపేట, రామగుండం కమిషనరేట్ల భవనాల నిర్మాణాలు పూర్తి చేసింది. ఈ 17 భవనాల కోసం ప్రభుత్వం రూ.654 కోట్లను ఖర్చు చేసింది.
తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆహ్లాదకరమైన, ఆధునిక హంగులు కలిగిన ‘స్మార్ట్ బిల్డింగ్స్’ను నిర్మిస్తున్నారు. భూకంపాలను సైతం తట్టుకునేలా, సమావేశ మందిరాలు, కాన్ఫరెన్స్హాళ్లు, నాణ్యమైన ఫ్లోరింగ్, ఆకట్టుకునే ఫర్నీచర్, పరిశుభ్రమైన టాయిలెట్లు, ఫైర్ అలారం, పబ్లిక్ అడ్రస్ సిస్టం, ఇంటర్నెట్, టీవీ సౌకర్యం, ఆహ్లాదకరమైన రిసెప్షన్, దివ్యాంగులు రావడానికి వీలుగా ర్యాంపులు అన్నీ ఆధునిక పద్ధతిలో అందంగా నిర్మిస్తున్నారు. జంట నగరాల్లో నిజాం కాలంనాటి పాత పోలీస్స్టేషన్ల స్థానంలో రూ.175 కోట్లతో 19 కొత్త పోలీస్ భవనాలు నిర్మించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం వంటి ప్రాంతాల్లో ఒక్కో స్టేషన్‌ను రూ.2 కోట్ల ఖర్చుతో నిర్మించింది. పోలీస్స్టేషన్లలో రోజువారీ ఖర్చుల కోసం జంటనగరాల్లోని స్టేషన్లకు నెలకు రూ.75 వేలు, జిల్లా కేంద్రాల్లోని పీఎస్‌లకు రూ.50 వేలు, మండల కేంద్రాల పీఎస్‌లకు రూ.25 వేలు మెయింటెనెన్స్ అలవెన్స్ కింద ఇస్తున్నది. ఇక ప్రతీ జోన్‌లోనూ ప్రత్యేకించి మహిళా పోలీస్ స్టేషన్ ఉండేలా చర్యలు తీసుకుంటూ ఆడబిడ్డల రక్షణకు కంకణం కట్టుకున్నది రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ సీఎం కేసీఆర్ పౌరుల భద్రతపైనే దృష్టిపెట్టారు. ఎప్పటికప్పుడు పెరిగిన జనాభాకు అనుగుణంగా రక్షణ కల్పించే విషయంలో ఆయన రాజీ పడటం లేదు. రాష్ట్ర ప్రజల రక్షణ కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని సరికొత్త పోలీసింగ్ వ్యవస్థను తెలంగాణలో అమలు చేస్తున్నారు. ఒక్క తెలంగాణలోనే పోలీస్స్టేషన్లు ఎంతో ఆహ్లాదకరంగా ఆధునిక హంగులతో ఉన్నాయి.
– కోలేటి దామోదర్, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్