Dark Web | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నార్కోటిక్ బ్యూరో సిబ్బంది డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ రాకెట్‌ను పట్టుకుంది. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గత నెల 31న డార్క్‌వెబ్‌లో హెరాయిన్ ఆర్డర్ చేసి, క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేశాడు. అస్సాంలోని సిల్పుఖురి నుంచి స్పీడ్ పోస్టు ద్వారా సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెట్టిన పోస్టుకు చేరుకుంది. పక్కా సమాచారంతో ఖమ్మం టూటౌన్ పోలీసులు, హైదరాబాద్ టీజీ న్యాబ్ పోలీసులు గురువారం ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను హెరాయిన్ కొరియర్ సహా పట్టుకున్నారు.
డార్క్‌వెబ్ నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న లింక్‌లపై నిఘా పెట్టినట్లు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు డ్రగ్స్‌కు అలవాటు పడొద్దని, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. డ్రగ్స్ సరఫరా సమాచారం తెలిస్తే 8712671111 లేదా 1908కి ఫోన్, tsnabho-hyd@tspolice. gov.inకి మెయిల్ చేయాలని కోరారు.