హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. వాయుగుండం తుఫానుగా మారితే ‘ఒర్ణబ్’ అని పేరు పెడుతామని వెల్లడించింది. ప్రస్తుతం వాయుగుండం ప్రభావం శ్రీలంకపై తీవ్ర ప్రభావం చూపనున్నదని స్పష్టంచేసింది. వాయుగుండం దిశ మార్చుకోవచ్చని వెల్లడించింది.
24 గంటల తర్వాత స్పష్టత వస్తుందని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, కేరళలలో వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో వాయుగుండం ప్రభావం ఉండదని వివరించారు. సాయంత్రం నుంచి ఉదయం 9 గంటల వరకు వాతావరణం అత్యంత చల్లగా, పొగమంచుతో ఉంటుందని వెల్లడించారు.