Hyderabad | హైటెక్ రోడ్లు.. కిలోమీటర్ల పొడవునా ఫ్లైఓవర్లు.. భారీ బహుళ అంతస్థుల భవనాలు..హైదరాబాద్‌లో ఎటుచూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఇంతటి హైటెక్ హైదరాబాద్‌ను సోషల్ ఇన్ఫ్లూయెన్సర్లు కండ్ల ముందు చూపిస్తున్నారు. కొందరు ప్రొఫెషనల్స్ అయితే డ్రోన్ కెమెరాలతో క్లిక్‌మనిపిస్తున్నారు. ఐటీ కారిడార్‌లోని భవనాలు, రోడ్లు, కూడళ్లను వివిధ కోణాల్లో తీసి ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఆధునికతకు ఐటీ కారిడార్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆకాశాన్నంటే బహుళ అంతస్థుల అద్దాల మేడలు హైదరాబాద్ రూపురేఖలను ఒక్కసారిగా మార్చేశాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ను తలదన్నేలా ఐటీ కారిడార్‌లో అడుగు పెట్టగానే సరికొత్త నగరం కండ్ల ముందు కదులాడుతున్నది. మాదాపూర్‌తో పాటు కొండాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, నార్సింగి, పుప్పాల్‌గూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్, కోకాపేట దాకా ఐటీ కారిడార్ విస్తరిస్తున్నది. దీంతో ఈ ప్రాంతాల్లో భారీ అంతస్థుల భవనాలు వెలుస్తున్నాయి. ఆ వీధులన్నీ విదేశాలను తలపిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న ఆధునిక వ్యాపార కేంద్రాలు, టెకీల అభిరుచులకు అనుగుణంగా ఏర్పాటైన వ్యాపార సంస్థల దృశ్యాలను ఇన్ఫ్లూయెన్సర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ సర్కారు శ్రమకు గుర్తింపు
అంతర్జాతీయ పెట్టుబడులు రావాలంటే మెరుగైన మౌలిక వసతులు, అనుకూల పాలసీలు ఎంతో ముఖ్యం. ఈ రెండింటిపై దృష్టిపెట్టిన బీఆర్ఎస్ సర్కారు అనేక కంపెనీలను ఆకర్షించింది. ఐటీ, రియల్ ఎస్టేట్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో ఐటీ కారిడార్ హైటెక్ హంగులను జోడించుకొని వావ్! అనిపించేలా తయారైంది.