Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి): విశాలమైన రహదారులు.. ఆకాశాన్ని అంటే ఎత్తయిన భవనాలు.. ఇవన్నీ నిన్నటి వరకు హాంకాంగ్, న్యూయార్క్ వంటి నగరాలకే పరిమితం. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ చుక్కలను తాకేలా 60 అంతస్థుల భవనాలు నిర్మితమవుతున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంస్థ కోల్డ్‌వెల్ బ్యాంకర్ రిచర్డ్ ఎల్లిస్ (సీబీఆర్ఈ) ఏషియన్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించిన సర్వేలో.. ఎత్తయిన భవనాల్లో హైదరాబాద్ నగరం దేశంలోనే రెండో స్థానంలో ఉన్నది.
సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి అనేక మంది సెలబ్రిటీలు హైదరాబాద్‌ను చూసి అబ్బురపడుతున్నారు.. అమెరికన్ నగరాలను చూసినట్టు ఉన్నదంటూ కితాబిస్తున్నారు. తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంస్థ కోల్డ్‌వెల్ బ్యాంకర్ రిచర్డ్ ఎల్లిస్ (సీబీఆర్ఈ) ఏషియన్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది. ఎత్తయిన భవనాల్లో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నదని ‘స్కై ఈజ్ లిమిట్.. రైజ్ ఆఫ్ టాలెస్ట్ బిల్డింగ్స్ ఇన్ ఇండియా’ పేరిట విడుదల చేసిన నివేదికలో 77 శాతం ఎత్తయిన భవనాలు ముంబైలో ఉండగా, 8 శాతం హైదరాబాద్‌లో ఉన్నట్టు తేలింది. కోల్‌కతా, 7 శాతం, నోయిడా 5 శాతం ఉండగా, గుర్గావ్, బెంగళూరు, చెన్నైలో ఒక శాతం చొప్పున ఎత్తయిన బిల్డింగులు ఉన్నాయి. ముంబైకి మూడు వైపులా నీళ్లు (సముద్రం) ఉండటంతో ఇక్కడ భౌగోళికంగా విస్తరణకు అవకాశం లేనందున ఎత్తయిన భవనాలు నిర్మించడం అనివార్యంగా మారింది. కానీ హైదరాబాద్‌కు ఉన్న అనేక భౌగోళిక అనుకూలతల్లో విస్తరణకు పుష్కలమైన అవకాశం ఉన్నది. అందుకే గత తొమ్మిదేండ్లలోనే హైదరాబాద్.. 10-20 కిలోమీటర్ల మేర పెరిగింది. పైగా లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కూడా ఉన్నది. అయినా, ఎత్తయిన భవనాలు గణనీయంగా పెరిగాయంటే అంతర్జాతీయంగా నగరం ఎంతగా అభివృద్ధి చెందుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో ఇప్పటివరకు 58 అంతస్థుల (236 మీటర్లు) అతి ఎత్తయిన భవనం నిర్మితమవుతోంది. గతంలో పది అంతస్థులే గొప్ప అనుకొంటే, ఇప్పుడు 25-58 అంతస్థుల భవనాలు 63 ఉండగా, మరో 60కి పైగా బిల్డింగులు నిర్మాణ దశలో ఉన్నాయి.