అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు.. ఆకాశాన్నంటే భవనాల్లో ఐటీ కంపెనీలు.. విదేశాల తరహాలో స్కైవేలు, హరితహారంతో పరుచుకున్న పచ్చందాలు. ‘హార్ట్ ఆఫ్ ద వరల్డ్’గా హుస్సేన్‌సాగర్. మణిహారంలా విస్తరించిన ఔటర్ రింగురోడ్డు. చారిత్రక నగరం హైదరాబాద్ స్వరాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా, శరవేగంతో అభివృద్ధి చెందుతున్నది. హైదరాబాద్ మహానగర ఔన్నత్యాన్ని చాటి చెప్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): నాలుగు వందల ఏండ్ల చారిత్రక నగరం.. ఎన్నో విశేషాలు, మరెన్నో గొప్పగొప్ప ఆనవాళ్లు.. చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొన్న నగరం మన హైదరాబాద్. ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన ఈ మహా నగరం స్వరాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా, శరవేగంతో అభివృద్ధి చెందుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు నగరానికి వన్నె తెస్తున్నాయి. ఆకాశాన్నంటే భవనాల్లో ఐటీ కంపెనీలు, విదేశాల తరహాలో స్కైవేలు, తెలంగాణకు హారితహారంతో హైదరాబాద్ చుట్టూ పరుచుకున్న పచ్చందాలు నగరానికి నగిషీలు అద్దుతున్నాయి. ఇక తెలంగాణలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు వైవిధ్యమైన మహానగరంగా పరిణితి చెందేలా చేశాయి. హైదరాబాద్ మహానగర ఔనత్యాన్ని చాటి చెప్తున్న ఓ వీడియో నెట్టింట సందడి చేస్తున్నది.
ఎకో ఫ్రెండ్లీ సిటీ
650 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మహానగరంలో 3,500 చెరువులు, కుంటలు ఉండగా.. నగరానికి తిలకం బొట్టులా ఉండే హుస్సేన్‌సాగర్ అందాలు హైదరాబాద్ మొత్తానికి వన్నె తెచ్చాయి. ఒకప్పుడు చెత్తాచెదారం నిండిన హుస్సేన్‌సాగర్ ఇప్పుడు “హార్ట్ ఆఫ్ ద వరల్డ్”గా ఐక్యరాజ్య సమితి టూరిజం సంస్థ నుంచి గుర్తింపు తెచ్చుకొన్నది. ఇక నగరానికి మణిహారంలా చుట్టూ 158 కిలోమీటర్లు విస్తరించిన ఔటర్ రింగురోడ్డు కొత్తందాలకు నిలయంగా మారింది. ట్రాఫిక్ నియంత్రణతోపాటు సామాజిక అడవులకు కేంద్రంగా మారింది. ఓఆర్ఆర్ చుట్టూ విస్తరించిన గ్రోత్ సిటీ 650 లక్షల మొక్కలతో గ్రీన్ కారిడార్‌గా పచ్చని అడవిని తలపిస్తున్నది.
దాదాపు 881 కిలోమీటర్ల అవెన్యూ ప్లాంటేషన్, 56 లక్షల మొక్కలతో కాలనీ ప్లాంటేషన్, కోటిన్నరకుపైగా ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్‌కు తోడు 250 హెక్టార్ల విస్తీర్ణంలో ఓఆర్ఆర్ వెంట చేపట్టిన బ్లాక్ ప్లాంటేషన్‌తో అత్యంత వేగంగా పచ్చదనం పరుచుకొన్నది. వీటితోపాటు చెరువుల సుందరీకరణలో భాగంగా నగరంలో 24 చెరువులు, కుంటల కట్టలపై చేపట్టిన గ్రీనరీ పెంపకం, 1,087 అర్బన్ పార్కులు, 600 నర్సరీలు, 57 థీమ్ పార్కులు, 12.5 హెక్టార్ల ల్యాండ్ స్కేప్ గార్డెనింగ్, జపాన్ టెక్నాలజీ మియావాకీ అడవుల పెంపకంతో పదేండ్లలో రికార్డు స్థాయిలో గ్రీనరీ నిండిపోయింది. 2011లో 33.15 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉన్న గ్రీన్ కవర్, 2021 నాటికి ఏకంగా 81.81చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దీంతో హైదరాబాద్ రెండుసార్లు గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్‌గా గుర్తింపు తెచ్చుకొన్నది. హరితహారం పథకాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలు చేయడమే ఎకో ఫ్రెండ్లీ సిటీగా నిలిచింది.

ఆవిష్కరణలకు నిలయం
పారిశ్రామికాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి సులభతర పారిశ్రామిక విధానాలు అమల్లోకి తేవటంతో నగరానికి పెట్టుబడులు ప్రవాహంలా వస్తున్నాయి. ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను పెంచేలా చేపట్టిన టీ హబ్ నిర్మాణం ఐటీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణల దిశను మార్చివేసింది. దేశంలో మరే నగరంలో లేనివిధంగా తీసుకువచ్చిన ఐటీ విధానాలు కంపెనీలను ఆకట్టుకొంటున్నాయి. ప్రపంచ దేశాలు కరోనాతో గజగజ వణికిపోతుంటే… వ్యాక్సిన్ తయారీలో నూతన శకాన్ని ప్రారంభించి ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ పేరు సంపాదించుకొన్నది. అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీలు మనదేశంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో స్వరాష్ట్రంలో అత్యుత్తమ నివాసయోగ్య (మోస్ట్ లివబుల్ సిటీ)గా ఐదు సార్లు ర్యాంకును హైదరాబాద్ సొంతం చేసుకొన్నది. ఈ విశేషాలను నలు దిశలా చాటిప్తున్న వీడియో నెట్టింట సందడి చేస్తున్నది.
సీఎం కేసీఆర్‌కు వందనాలు
ఎంపీ సంతోష్ ట్వీట్
హైదరాబాద్ నగర ఔనత్యాన్ని చాటిచెప్తున్న ఈ వీడియోను ఎంపీ సంతోష్ ట్వీట్ చేశారు. ‘దేశంలోనే అత్యంత వైవిధ్యభరిత నగరంగా అద్భుతంగా కీర్తించబడుతున్నది. సీఎం కేసీఆర్ ఆలోచనలు నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దినందుకు వందనాలు’ అని హర్షం వ్యక్తం చేశారు.