ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు, రోబోటిక్స్‌కు హైదరాబాద్ అడ్డాగా మారుతున్నది. నగరంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన అపారమైన మానవ వనరులు అందుబాటులో ఉండటం కొత్త పెట్టుబడులకు మరింత ఊతమిస్తున్నది. ఏఐ, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్ తదితర విభాగాల్లో హైదరాబాద్‌కు రానున్న కాలంలో పెద్దయెత్తున పెట్టుబడులు రానున్నాయి.
– లాఫ్రాన్స్, వైస్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్
Hyderabad | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘ప్రపంచాన్ని నడిపించే గూగుల్‌కు హైదరాబాద్ గుండెకాయ వంటిది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఆయువుపట్టు మన భాగ్యనగరం’ అని 2021 అక్టోబర్‌లో ఐటీమంత్రి కేటీఆర్ అన్న మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. సాంకేతిక రంగంలో హైదరాబాద్ సాధిస్తున్న వృద్ధిని యావత్తు ప్రపంచం ప్రశంసిస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ-కృత్రిమమేధ), రోబోటిక్స్, డాటా ప్రొటెక్షన్ వంటి వినూత్న రంగాల్లో హైదరాబాద్ అపారమైన అభివృద్ధిని సాధించిందని అమెరికా టెక్ నిపుణులు ప్రశంసించారు. కొత్త సాంకేతికతలకు ఒకరకంగా భాగ్యనగరం కేంద్రంగా మారిపోయిందని కితాబు ఇచ్చారు. ఈ మేరకు అమెరికాలోని బోస్టన్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ జర్నలిస్టుల సదస్సులో పలువురు సాంకేతిక నిపుణులు తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగిన సాంకేతిక అభివృద్ధిని ప్రముఖంగా ప్రస్తావించారు.
అమెరికాలో సాంకేతిక విప్లవం మొగ్గ తొడగడానికి భారతీయులు కూడా ప్రధాన కారణమని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (ఐఐసీ) వైస్ ప్రెసిడెంట్ ఆన్ లాఫ్రాన్స్ అన్నారు. అమెరికాలోని చాలావరకూ టెక్ కంపెనీలకు భారతీయులే సారథులని ఆమె గుర్తుచేశారు. అమెరికాకు చెందిన అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ తదితర దిగ్గజ కంపెనీలు భాగ్యనగరంలో ప్రధాన శాఖలను ఏర్పాటు చేయడాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను ‘టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియా’గా అభివర్ణించారు. నైపుణ్యం కలిగిన అపారమైన మానవ వనరులతోపాటు విస్తృతమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న కారణంగా ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ తదితర రంగాల్లో హైదరాబాద్‌కు రానున్న రోజుల్లో పెద్దయెత్తున పెట్టుబడులు తరలిరానున్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో రాష్ట్రంలో ఐటీరంగ ముఖచిత్రమే సమూలంగా మారిపోయింది. తొమ్మిదేండ్లలో ఐటీ ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నది. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన 20కి పైగా బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సీలు) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. వరల్డ్ టాప్ టెక్ కంపెనీలుగా పిలిచే గూగుల్, అమెజాన్, యాపిల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ సంస్థలు తమ ప్రధాన వ్యాపార కార్యకలాపాల కేంద్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయి.
గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టంలోనూ తెలంగాణ తన సత్తా చాటుకొన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ నివేదికగా చెప్పుకొనే జీఎస్‌ఈఆర్-2022లో రాష్ర్టానికి స్థానం దక్కడం విశేషం. గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టంలో తెలంగాణ టాప్-10లో స్థానాన్ని దక్కించుకోగా, ఏషియన్ ఎకో సిస్టం ఇన్ అఫర్డబుల్ టాలెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. టీ-హబ్, టీఎస్ఐసీ, వీ-హబ్, టాస్క్, రిచ్, టీ-వర్క్స్, తెలంగాణ ఇన్నోవేషన్ నెట్వర్క్ తదితర ఇంక్యుబేటర్ల ఏర్పాటుతో ఐటీ పురోగతి కొత్త శిఖరాలకు చేరిందని చెప్పొచ్చు. అంతేకాదు, ఐటీరంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం.. ప్రతీ ఐదేండ్లకోసారి (2016లో, 2021లో) ఐటీపాలసీని రూపొందించడమే కాకుండా సమర్థంగా అమలు చేస్తున్నది. ఫలితంగా దేశానికి ఐటీ హబ్‌గా హైదరాబాద్ మారింది.
2014లో ఐటీ ఎగుమతులు రూ. 57,258 కోట్లు
2023లో ఐటీ ఎగుమతులు రూ. 57,258 కోట్లు
తొమ్మిదేండ్లలో పెరుగుదల 321.38 శాతం
2014లో ఐటీ ఉద్యోగాలు3,23,396
2023లో ఐటీ ఉద్యోగాలు 9,05,715
తొమ్మిదేండ్లలో పెరుగుదల 180.06 శాతం
దేశవ్యాప్తంగా కల్పించిన ఐటీ ఉద్యోగాలు 32,90,000
ఉమ్మడి ఏపీలో కల్పించిన ఐటీ ఉద్యోగాలు 3,23,396
దేశవ్యాప్త ఐటీ ఉద్యోగాల్లో ఉమ్మడి ఏపీ వాటా 9.83 శాతం
దేశవ్యాప్తంగా కల్పించిన ఐటీ ఉద్యోగాలు 21,10,000
తెలంగాణలో కల్పించిన కొత్త ఉద్యోగాలు 5,82,319
దేశవ్యాప్త ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ వాటా 27.6 శాతం