ఖైరతాబాద్, నవంబర్ 4: పుస్తక ప్రియులకు శుభవార్త. వచ్చే నెల 19 నుంచి ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ ప్రారంభంకానున్నది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగనున్నదని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు యాకుబ్ తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుక్ ఫేయిర్ లోగోను ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ, విదేశాలకు చెందిన పుస్తకాలు బుక్ ఫెయిర్‌లో అందుబాటులో ఉండనున్నట్టు వెల్లడించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ ఎడిటర్ కే రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ రమా మేల్కొటే, సొసైటీ ప్రధాన కార్యదర్శి వాసు, కోశాధికారి నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి, శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.