Skyroot cryogenic engine | హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్.. స్కైరూట్ ఎయిరోస్పేస్ మరో సంచలన రికార్డు నెలకొల్పింది. పూర్తిగా దేశీయ టెక్నాలజీతో క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడంతోపాటు ప్రయోగాత్మకంగా పరీక్షించింది. దీనికి ఇండియన్ రాకెట్ శాస్త్రవేత్త సతీశ్ ధావన్ పేరొచ్చేలా ధావన్-1 అని నామకరణం చేసింది.
తక్కువ ఖర్చుతో క్లీన్ రాకెట్ ఫ్యూయల్.. ల్వికిడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ), లిక్విడ్ ఆక్సిజన్ (ఎల్వోఎక్స్)తో నడిచే ఈ క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్‌ను 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో అభివృద్ధి చేశామని స్కైరూట్ ఎయిరోస్పేస్ తెలిపింది. ఇప్పటి వరకు క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్ల తయారీ సమయంతో పోలిస్తే 95 శాతం తక్కువ టైంలో దీన్ని అభివృద్ధి చేశారు.
ఇది పూర్తిగా మేడిన్ ఇండియా క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్‌గా నిలుస్తుందని స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు-సీఈవో పవన్‌కుమార్ చందన చెప్పారు. ఈ టెక్నాలజీతో ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాత్మక పరీక్ష విజయవంతం చేసిన కొద్ది సంస్థల్లో ఇది ఒకటిగా నిలువనున్నది. త్వరలో ప్రయోగించే విక్రం-2 ఉపగ్రహ వాహన నౌకలో వినియోగించనున్నారు.
మైనస్ 150డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్రొపెల్లెంట్స్ నిల్వ చేసే ఇంజిన్‌ను క్రయోజనిక్ ఇంజిన్ అంటారు. గతేడాది డిసెంబర్లో కలాం-5 ఘన ప్రొపల్షన్ రాకెట్ ఇంజిన్‌ను స్కైరూట్ అభివృద్ధి చేసింది. తాజాగా ఆవిష్కరించిన ధావన్-1 క్రయోజనిక్ ఇంజిన్.. స్కైరూట్ మూడు ప్రొపెల్షన్ టెక్నాలజీలను అభివృద్ధి చేసిన సంస్థగా మైలురాయి నమోదు చేసుకుంది. ఈ బృందానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత వీ జ్ఞాననిధి సారధ్యం వహిస్తున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ గ్రీన్కో గ్రూప్ సహకారంతో ఈ క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్ రూపుదిద్దుకున్నది.