
ఇల్లందకుంట, ఆగస్టు 9: బీజేపీ నేత ఈటల రాజేందర్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావును పోటీచేయమనే అర్హత నీకు లేదని, నీ స్థాయికి మామూలు కార్యకర్త చాలు అని ఎద్దేవా చేశారు. సోమవారం ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి, గడ్డివానిపల్లి గ్రామాల్లో గ్రామస్తులతో సమావేశమై, మాట్లాడారు. త్వరలోనే ఈటల రాజేందర్ నుంచి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు విముక్తి కలుగుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా రాదన్నారు. ఎన్నికలొస్తే చాలు బీజేపోళ్లకు గుండెపోటు, వీల్చైర్లు గుర్తుకువస్తాయని, గతంలో బండి సంజయ్, రఘునందన్‌రావు అలాగే గెలిచారని ఎద్దేవా చేశారు. బండి ఎంపీగా గెలిచి ఇన్నిరోజులైనా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై పూర్తిగా వివక్ష చూపుతున్నదని, రాష్ర్టానికి రావాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని, ఊరూరా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని ఉద్ఘాటించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లలా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, సర్పంచ్‌లు రాజిరెడ్డి, లలిత, ఎంపీటీసీలు ఓదెలు, సంజీవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వీరారెడ్డి, తిరుపతిరెడ్డి, రాజ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.