
హుజూరాబాద్, ఆగస్టు 9: రెడ్డి కులస్తులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న టీఆర్ఎస్కే మద్దతునిస్తున్నట్లు రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంది తిరుపతిరెడ్డి ప్రకటించారు. హుజూరాబాద్ పట్టణంలోని వెంకటసాయి గార్డెన్లో రెడ్డి ఐక్యవేదిక నాయకులు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. 15 రోజుల క్రితం ప్రభుత్వానికి విన్నవించామని, సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమని పేర్కొన్నారు. దీంతో పాటు అభ్యర్థుల వయోపరిమితిని ఐదేండ్ల పాటు పెంచడం కేసీఆర్ ఉదార స్వభావానికి నిదర్శనమన్నారు. వ్యవసాయ భూమి, ఆస్తులకు సంబంధం లేకుండా రూ.8లక్షల లోపు ఆదాయం ఉన్న రెడ్డి కులస్తులందరికీ ఈడబ్ల్యూఎస్ అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. రెడ్డి కులస్తుల్లో చాలా మంది రైతు బంధు, రైతు బీమాతో లబ్ధి పొందుతున్నారని చెప్పారు. రైతాంగానికి సాగునీరు అందించేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజేపీ నాయకులు జాతీయ హోదా ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని సర్కారు నిర్లక్ష్యం వల్లే దేశంలో కొవిడ్ తీవ్రత పెరిగిందని మండిపడ్డారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూంపెల్లి రాఘవరెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, నాయకులు బండ గోపాల్‌రెడ్డి, ఏనుగు చుక్కారెడ్డి, చందుపట్ల నర్సింహారెడ్డి, పెండ్యాల రాఘవరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రెడ్డి సంపత్‌రెడ్డి, కంకణాల సరోజన, గూడూరి స్వామిరెడ్డి, జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను అమలు చేయడం సంతోషకరం. దీనిని రెడ్డి కులస్తులు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రంలో వ్యవసాయానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వ్యవసా య భూమి, ఆస్తులకు సంబంధం లేకుండా రూ.8లక్షల ఆదాయం ఉన్న రెడ్డి కులస్తులందరికీ ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం హర్షణీయం. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలనే ఆయన ఆలోచనలు మరెవరూ చేయలేరు. – శ్రీనివాస్‌రెడ్డి, చెల్పూర్
విద్య, ఉద్యోగాల్లో ఐదేండ్ల వయస్సు సడలింపు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. రెడ్డి కులస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు టీఆర్ఎస్ సర్కారు కృషి మరువలేనిది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుతో రెడ్డి కులస్తులకు మంచి రోజులు వచ్చాయి. రైతు బీమాతో వ్యవసాయదారుల కుటుంబాలకు అండగా నిలవడం దేశంలోనే ఎక్కడా లేదు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాలకు జీవితంపై నమ్మకం పెరిగింది.
-కంకణాల సరోజన, కందుగుల
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పూర్తి స్థాయి అమలుతో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగు తాయి. గత పాలకులు రెడ్డి కులస్తుల అభ్యున్న తిని పట్టించుకోలేదు. రెడ్డి కులస్తులు రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలి. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. ఆయన అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్‌లా ఆలోచించి, అహర్నిశలూ పనిచేసే వ్యకి ఇంకెవరూ లేరు. ఆయనకు సంపూర్ణ మద్దతునిస్తున్నాం.
-గూడూరి స్వామిరెడ్డి, ఇప్పల్ నర్సింగాపూర్
ఈడబ్ల్యూఎస్ అమలుతో రెడ్డీలకు మంచి రోజులు వచ్చాయి. ఆస్తులతో సంబంధం లేకుండా వార్షికాదాయం రూ.8లక్షలు నిబంధన సడలించడం సంతోషకరం. దీంతో చాలా మందికి లబ్ధి చేకూరుతుంది. వయస్సు సడలింపు ఐదేండ్లకు పెంచడంతో నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. రైతు బంధుతో పెట్టుబడి ఇబ్బందులు తొలిగాయి. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కేసీఆర్ అహర్నిశలూ కృషి చేస్తున్నారు. ఇంతకుముందున్న సీఎంలలా కాకుండా ఎన్నో మంచి పథకాలను ప్రవేశ పెట్టి పేదలు, రైతులకు నేనున్నా అనే భరోసానిచ్చిండు.
-చందుపట్ల నర్సింహారెడ్డి, కమలాపూర్