
జమ్మికుంట/ఇల్లందకుంట, ఆగస్టు 9: టీఆర్ఎస్ జోరు కొనసాగుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని పల్లె, పట్టణం ఏకమవుతున్నది. రాష్ట్ర సర్కారు కనీవినీ ఎరుగని రీతిలో చేసిన అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై కులసంఘాలూ, యూనియన్లు ఒక్కటవుతున్నాయి. పార్టీకి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ టీఆర్ఎస్కే మా ఓటు అంటూ నినదిస్తున్నాయి. ఇటీవలే పలు గ్రామాల్లో గొల్ల, కుర్మలు, రజకులు, మాలమహానాడు నాయకులు, విశ్వ బ్రాహ్మణులు, విద్యుత్ కార్మిక సంఘాలు మద్దతు పలుకగా, తాజాగా జమ్మికుంట ఆటో డ్రైవర్లు, పాతర్లపల్లి, లక్ష్మాజిపల్లి గొల్లకుర్మలు మద్దతు పలికారు.
పల్లెలు కదులుతున్నాయి.. ప్రజలు సహా కులసంఘాలు.. యూనియన్లు ఒక్కటవుతున్నాయి.. స్వచ్ఛందంగా ముందుకొచ్చి, టీఆర్ఎస్ కు జై కొడుతున్నాయి.. ‘టీఆర్ఎస్ వెంటే ఉంటాం.. కేసీఆరే మా నాయకుడు’ అంటూ మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేయడమే కాదు కారు గుర్తుకే మా ఓటు అంటూ నినదిస్తున్నాయి. సోమవారం జమ్మికుంట పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్లు మంత్రి కొప్పుల సమక్షంలో టీఆర్ఎస్కు మద్దతు పలికి పట్టణంలో భారీ ర్యాలీ తీయగా, ఇల్లందకుంట మండలంలోని పాతర్లపల్లి, లక్ష్మాజిపల్లి గొల్లకుర్మలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ‘మేం టీఆర్ఎస్ వెంటే ఉంటాం.. కేసీఆరే మా నాయకుడు’ అంటూ స్పష్టం చేశారు. ఇలా కారుకు మద్దతు పెరిగిపోతుండగా, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటున్నది.
టీఆర్ఎస్ వెంటే ఉంటామని జమ్మికుంట పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్లు సోమవారం ప్రకటించారు. పార్టీకి మద్దతుగా పట్టణంలో ఆటోలతో ర్యాలీ తీయగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి టీఆర్ఎస్కు జైకొడుతు న్నారని పేర్కొన్నారు. ఆటోలకు టాక్స్ రద్దు చేయడంతో ఆటో డ్రైవర్లకు మేలు జరిగిందని, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సబ్బండ వర్ణాలు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. కాగా, ఆటో డ్రైవర్లు ‘జై టీఆర్ఎస్.. జైజై టీఆర్ఎస్’ అంటూ నినదించారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ తకళ్లపల్లి రాజేశ్వర్‌రావు, ఆటోయూనియన్ అధ్యక్షుడు పురం రమేశ్, ఉపాధ్యక్షుడు జంపయ్య, కార్యదర్శి ఎండీ మెహబూబ్, కౌన్సిలర్లు ఉన్నారు.
ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి, లక్ష్మాజిపల్లి గొల్లకుర్మలు టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు పలికారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇల్లందకుంట ఇన్చార్జి గోసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో కులస్తులంతా సమావేశమై, ఏకగ్రీవంగా తీర్మానించారు. తీర్మాన ప్రతులను శ్రీనివాస్‌కు అందజేశారు.గత పాలకులెవరూ తమను పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రంలో అనేక పథకాలతో అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి అండగా ఉంటామని, ఈ క్రమంలోనే టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతుని స్తూ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నట్లు గొల్ల, కుర్మ కులస్తులు చెప్పారు. ఇల్లందకుంట మండల ఇన్చార్జి కడారి భిక్షపతి, యాదవ సంఘం మండలాధ్యక్షుడు మహిపాల్‌యాదవ్, యాదవ సొసైటీ అధ్యక్షుడు గడ్డి రాములు, జిల్లా యాదవ సంఘం నాయకులు రవి కుమార్ యాదవ్, సొసైటీ అధ్యక్షుడు మల్లన్న యాదవ్, వంగ రాజు యాదవ్, ఉపసర్పంచ్ పెద్ద గొల్ల కుమార్ యాదవ్, పాతర్లపల్లిలో ఉప సర్పంచ్ గణేశ్ యాదవ్, అన్నం కొమురయ్య యాదవ్, కుడారి కొమురయ్య యాదవ్, మైపాల్ యాదవ్ ఉన్నారు.