బెజ్జంకి, జూన్ 1: భార్య చికెన్ వండలేదని భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం గ్రామంలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దశరథ్ (40) అనే వ్యక్తి కుటుంబంతో పోతారం శివారులోని ఓ పౌల్ట్రీఫాంలో పనిచేస్తున్నాడు. దశరథ్ అనారోగ్యానికి గురికాగా గురువారం దవాఖానకు తీసుకెళ్ల్లారు. ఇంటికి వచ్చిన తరువాత చికెన్ వండాలని భార్యను కోరగా డాక్టర్ వద్దని చెప్పాడని వారించడంతో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన దశరథ్ వెంటనే గుర్తుతెలియని పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతిచెందినట్టు బెజ్జంకి ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. మృతుడి భార్య సంగోలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.