హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు కేంద్రం ఇంతవరకు నయాపైసా ఇవ్వలేదని అధికారులు పేర్కొంటున్నారు. జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం వచ్చి అంచనా వేసి వెళ్లిందని, కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదని అంటున్నారు. ఈ ఏడాది సీజన్ ఆరంభంలోనే వర్షాలు దంచి కొట్టాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లడంతో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కల్వర్టులు, పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఈ నష్టాన్ని అంచనా వేసిన రహదారులు భవనాలశాఖ ఆ వివరాలను విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా కేంద్రానికి పంపింది. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి మన అధికారులు నష్టం జరిగిన ప్రాంతాలను చూపించారు. తక్షణం సహాయం చేసి రహదారుల పునరుద్ధరణ జరిగేలా చూడాలని కోరారు. కానీ ఇప్పటివరకు అర్ధరూపాయి కూడా రాలేదని తెలిపారు. కేంద్రంపై ఆశలు సన్నగిల్లిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి ముందుగా తక్షణ మరమ్మతులు చేపట్టి రాకపోకలు సాఫీగా సాగించేందుకు వీలుగా రూ.10 కోట్లు కేటాయించింది. దీంతో అధికారులు తక్షణ మరమ్మతులు చేపట్టి రహదారులపై రాకపోకలు పునరుద్ధరిస్తున్నారు.
ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు 1841 కిలోమీటర్ల మేరకు రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయి. ఇందులో కొన్ని రోడ్లు కోతకు గురయ్యాయి, 412 కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటికకి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయడానికి రూ. 498.24 కోట్లు ఖర్చు అవుతాయని రోడ్లు భవనాలశాఖ ఇంజినీర్లు అంచనాలు వేసి విపత్తుల నిర్వహణ శాఖకు పంపించారు. కానీ కేంద్రం నుంచి కనీస సహాయం కూడా అందలేదు. దీంతో రాష్ట్ర ప్రజలకు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదన్న భావనతో తాత్కాలికంగానైనా మరమ్మతులు చేయడానికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది.