Medical Seats | హైదరాబాద్, మే 5(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచింది. పరిపాలనను సీఎంవోకు వదిలిపెట్టి సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, లేదంటే ఢిల్లీకి వెళ్లే ఫ్లైట్ మోడ్‌లోనే కాలం గడుపుతున్నారు. ఎకే విమానం.. దిగే విమానం అన్నట్టుగానే ఆయన 15 నెలల పరిపాలన సాగడంతో పాలనాపరమైన ఫైళ్లకు బూజు పట్టినట్టు సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సీఎంవో అధికారుల మధ్య సమన్వయ లోపం, అవగాహన రాహిత్యం, పనితీరులో జాప్యం తదితర కారణాలతో వందలాది ఫైళ్లు దీర్ఘకాలంగా పెండింగు ఉన్నట్టు ఇటీవలి తనిఖీల్లో బయటపడ్డట్టు తెలిసింది. 2024-25 విద్యా సంవత్సరానికిగాను రాష్ర్టానికి 240 మెడికల్ సీట్లు కొత్తగా రావాల్సి ఉండగా, సీఎంవోలోని ఓ అధికారిణి నిర్లక్ష్యం మూలంగా అవి రద్దయినట్టు గుర్తించిన అధికారులు సీఎంకు సమాచారం అదించినట్టు తెలిసింది.
ఈనేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి పెండింగ్ ఫైళ్ల మీద ఆరా తీయగా దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఏడుగురు కార్యదర్శులు ఉన్నప్పటికీ, ఒకరితో ఒకరికి పొంతన కుదరకపోవడం, వివిధ శాఖల హెచ్‌వోడీలతో సమన్వయం చేసుకోవడంలో నిర్లక్ష్యం, వారిని లీడ్ చేసే నాయకుడు లేకపోవడం తదితర కారణాలతో ఎక్కడి ఫైళ్లు అక్కడే మూలకు పెట్టినట్టు తేలింది. ప్రధానంగా సీఎంవోలోని ఇద్దరు కీలక సెక్రటరీల వద్ద పెద్ద ఎత్తున పెండింగ్ ఫైల్స్ పేరుకుపోయాయని గుర్తించినట్టు తెలిసింది. ఆ ఇద్దరు సెక్రటరీలు చూస్తున్న రెండు శాఖలు కూడా సీఎం దగ్గర ఉన్న శాఖలే కావడంతో సీఎం వారి పట్ల కొంత ఉదాసీనతతో ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతానికి వారిని వదిలేసి మిగిలిన సెక్రటరీలను మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం.
కార్యదర్శులను కుదించాలని..
ఏడుగురు కార్యదర్శులతోనే సీఎంవో వివాదాస్పదంగా మారిందనే అనుమానంతో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి కార్యదర్శుల సంఖ్యను ఐదుకు కుదించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగా సీఎంవో నుంచి ఇటీవల ఒకేసారి ముగ్గురు సెక్రటరీలను బదిలీ చేశారు. సీఎం సెక్రటరీగా ఉన్న ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసింను రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. సీఎంవో సంయుక్త కార్యదర్శిగా ఉన్న సంగీత సత్యనారాయణను వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా పంపించారు. సీఎంవో సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నఫళంగా సీఎంవోలో తన ఛాంబర్ ఖాళీ చేసి మాతృశాఖ అటవీశాఖకు తిరిగి వెళ్లిపోయినట్టుగా తెలిసింది.
అయితే, ఆయన్ను రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమించేందుకు ప్రభుత్వం సిఫార్సు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ ఫైల్ ప్రస్తుతానికి గవర్నర్ వద్ద ఉన్నట్టు సమాచారం. ఆయన స్థానంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజును సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న జయేశ్ రంజన్‌ను సీఎంవోలోకి తీసుకొచ్చారు. వీరితోనే సీఎంవోను నిర్వహించాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్టు తెలిసింది. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఫైళ్ల నివేదిక తనకు ఇవ్వాలని సీఎంవో ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీనివాసరాజును రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. ఫైళ్ల క్లియరెన్స్ కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన్ను కోరినట్టు సమాచారం.