హైదరాబాద్, నిజామాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్‌కు చెందిన రౌడీషీటర్, కానిస్టేబుల్ ప్రమోద్‌కుమార్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. వార్తాకథనాల ఆధారంగా సుమోటో కేసు నమోదు చేసింది. రియాజ్‌పై కాల్పులకు దారితీసిన పరిస్థితులు, మేజిస్ట్రేట్ విచారణ, ఎఫ్ఐఆర్, పోస్ట్‌మార్టం నివేదిక కాపీలతో కూడిన వివరణను నవంబర్ 24లోపు సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. ఎన్కౌంటర్ మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదికను ఇవ్వాలని స్పష్టంచేసింది. కానిస్టేబుల్ ప్రమోద్‌కుమార్ మృతి చాలా బాధాకరమని పేర్కొన్నది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కుకు సంబంధించిన అంశాలను ఉటంకిస్తూ వివరణాత్మకమైన నివేదికను కోరుతూ ఎస్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పోలీసుశాఖలో పెరుగుతున్న హింసాప్రవృత్తికి రియాజ్ ఎన్కౌంటర్ నిదర్శనమని తెలంగాణ మానవహక్కుల వేదిక అభిప్రాయపడింది. విధులు నిర్వర్తిస్తూ ఊహించని కత్తిదాడి కారణంగా కానిస్టేబుల్ ప్రమోద్‌కుమార్ చనిపోవడం చాలా బాధాకరమని వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య విచారం వ్యక్తం చేశారు. రియాజ్‌కు కచ్చితంగా శిక్ష పడటం సమంజసమేనని, ఆ శిక్షను ఎవరు అమలు చేయాలనేదే నాగరిక సమాజంలో కీలకమైన విషయమని అన్నారు. ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి, పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగిన రియాజ్… సోమవారం పోలీసుల కాల్పుల్లో మరణించాడు. శనివారం పోలీసులకు చిక్కిన రియాజ్.. నిజామాబాద్ దవాఖానలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న సమయంలో ఆదివారం కానిస్టేబుల్ దగ్గర తుపాకీ లాక్కుని కాల్పులు జరిపేందుకు యత్నించగా… ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో.. రియాజ్ మరణించినట్టు డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. పోలీసుల కథనం ప్రకారం 17న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు రియాజ్‌ను అరెస్ట్ చేసి బైక్‌పై స్టేషన్‌కు తరలిస్తుండగా నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్‌కుమార్ (48)ను రియాజ్ కత్తితో గుండెలో పొడిచాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రమోద్‌కుమార్ చనిపోయారు. పోలీసుల వాహనాన్ని ఫాలో అవుతూ వచ్చిన తన అనుచరుల బైక్‌పై రియాజ్ నిజాబాబాద్‌కు శివారులోని సారంగపూర్ అటవీప్రాంతం వైపు పారిపోయాడు. ఈ ఘటనతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. డీజీపీ శివధర్‌రెడ్డి ఆదేశాలతో ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి రంగంలోకి దిగారు. రియాజ్‌ను పట్టుకునేందుకు సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ సారంగపూర్’ పేరుతో 8 బృందాలు గాలింపు చేపట్టాయి. శనివారం సాయంత్రం సారంగపూర్ ప్రాంతంలోనే రియాజ్ పోలీసుల కంటపడ్డాడు. పోలీసులపైకి రియాజ్ రాళ్లు విసరడంతో ఆత్మసంరక్షణలో భాగంగా ఎస్సై శ్రీకాంత్ 2 రౌండ్ల కాల్పులు జరిపారు. కానీ రియాజ్ నిజాంసాగర్ కాలువలో దూకి పారిపోయాడు. శనివారం చీకటి పడటంతో.. గాలింపునకు ఆటంకం ఏర్పడింది. ఆదివారం ఉదయం సాయుధ బలగాలు మళ్లీ పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో పాడుబడిన లారీలో దాక్కున్న రియాజ్‌ను స్థానికుడైన మెకానిక్ ఆసిఫ్ గుర్తించి, అదిమి పట్టుకున్నాడు. కానీ రియాజ్ కత్తితో ఆసిఫ్ రెండు చేతులపై గాయపర్చి, పారిపోయేందుకు యత్నించాడు. ఇదే సమయంలో పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని, తాళ్లతో రియాజ్‌ను బంధించి చేతులకు బేడీలు వేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆసిఫ్‌ను హైదరాబాద్‌లోని దవాఖానకు తరలించారు.
నిజామాబాద్ జీజీహెచ్ నాలుగో అంతస్థు రూమ్‌నంబర్ 407లోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న రియాజ్.. సోమవారం డ్యూటీలో ఉన్న పోలీసులపై రియాజ్ దాడి చేసి, పారిపోయేందుకు యత్నించాడు. రియాజ్‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేయగా.. పోలీసుల దగ్గరున్న ఆయుధాన్ని లాక్కుని, కాల్పులు జరిపేందుకు యత్నించాడు. రియాజ్‌ను నిలువరించడానికి పోలీసులు జరిపిన ప్రయత్నంలో అతడు చనిపోయినట్టు డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. రియాజ్ మృతదేహానికి సోమవారం రాత్రి పోస్ట్‌మార్టం నిర్వహించి, అతడి కుటుంబ సభ్యులకు అప్పగించగా, మంగళవారం అంత్యక్రియలు ముగిశాయి.
జీజీహెచ్‌లోని ఓ వార్డులో ఒక పాత నేరస్థుడు రియాజ్ ఉండగా రెగ్యులర్ చెకింగ్‌లో భాగంగా వార్డులోకి రిజర్వ్ ఇన్స్పెక్టర్, ఒక ఎస్సై, కానిస్టేబుల్ వెళ్లి చూడగా అద్దాలు, తలుపులు పగులకొడుతున్న సౌండ్ వచ్చింది. ఆర్ఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ వెళ్లి అలా చేయొద్దని చెప్పారు. గోల చేస్తున్న రియాజ్‌ను బెడ్ మీద కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రియాజ్.. కానిస్టేబుల్ దగ్గర నుంచి తుపాకీ లాక్కుని ట్రిగ్గర్ నొక్కడం మొదలు పెట్టాడు. గత్యంతరంలేక పోలీసులు ఫైర్ చేశారు.
– పీ సాయిచైతన్య, నిజామాబాద్ పోలీస్ కమిషనర్