హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి (Guru Purnima) సందడి నెలక్నొది. గురువారం తెల్లవారుజాము నుంచే సాయిబాబాను (Sai Baba) దర్శించుకునేందుకు భక్తులు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారిపోయాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని సాయిబాబాను దర్శించుకుంటున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, దిల్సుఖ్నగర్, పంజాగుట్టతోపాటు హైదరాబాద్లోని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాయినాథుడిని దర్శించుకొని తన్మయానికి గురయ్యారు.
ఇక మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో స్వామివారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. దీంతో శ్రీ సాయి, జయజయ సాయి, సాయి రాం నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమ్రోగుతున్నాయి. కాగా, హిందూ సంప్రదాయం ప్రకారం సాధారణంగా గురువును పూజించడానికి గురువారం విశేషమైనది. ఇక గురుపూర్ణిమ గురువారం కలిసివస్తే ఇక అంతకంటే విశేషమైన రోజు మరొకటి ఉండదు.
ఆషాఢ శుక్ల పౌర్ణమిని గురు పౌర్ణమిగా పరిగణిస్తూ వస్తున్నారు. ఈరోజు మనకు జ్ఞానాన్ని ఓసగిన గురువులను నూతన వస్త్రాలతో దక్షిణ తాంబూలాలతో సత్కరించుకోవడం ఒక సాంప్రదాయం. అదే విధంగా వేదం ప్రతిపాదించిన మేధా దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, రమణ మహర్షి శంకరాచార్యులు వంటి వారిని పూజించాలి. గురుశబ్దం త్రిమూర్తితత్త్వం. సృష్టి, స్థితి, లయకారం, అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువు. గురూ అనే శబ్దాన్ని విడదీస్తే ‘గ్-ఉ-ర్-ఉ’ అనే అక్షరాలు కనబడుతుంటాయి. వీటిలో ‘గ’ కారం సిద్ధకమైన బ్రహ్మకు, ‘ర’కారం పాపనాశకరమైన శివశాక్తికి సంకేతాలు. ఈ రెండూ పాలస్వభావం కలిగిన ‘విష్ణుశక్తి’తో కలిసినప్పుడే ‘గురు’ అనే పదం ఏర్పడి ‘గురు’తత్త్వం మూర్తీభవిస్తుంది. అందుకే గురువును మనం త్రిమూత్రిస్వరూపంగా భావిస్తూ పూజించుకుంటున్నాం. ‘గురి’ని కల్పించేవాడు గురువు. లక్ష్యసాధనామార్గాన్ని చూపేవాడే గురువు అని స్థూలార్థం. గురువు పరంపరాగత క్రమశిక్షణగలవాడైతే, శిష్యునకు ఉపదేశాన్ని అందిస్తాడు.