Congress | హైదరాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ): ‘దీపం’ ఉండగానే చక్కదిద్దుకుందామనుకున్న కొంత మంది కాంగ్రెస్ నేతల ఆశలు అడియాశలయ్యాయి. సడన్గా సదరు కీలక నేత వెళ్లిపోవడంతో వా రంతా లబోదిబోమంటున్నారు. ‘పైసలు పాయే.. పని కాకపాయే.. పదవి రాకపాయే’ అంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఇలా ఒక్కరో.. ఇద్దరో కాదు బాధితుల చిట్టా పెద్దగానే ఉందనే చర్చ కాంగ్రెస్లో జోరుగా జరుగుతున్నది. ‘మీకు ఏది కావాలో చెప్పండి చేసి పెడతా అంటూ’ అందర్నీ నమ్మించినట్టుగా ప్రచా రం జరుగుతున్నది. ఇంకేముంది ‘మీకు కావాల్సింది మీకిస్తాం.. మాకు కావాల్సింది మాకివ్వండి అనేలా’ ఇద్దరి మధ్య ఒప్పందాలు జరిగిపోయాయి. కీలక నేత హామీదారుగా ఉండటంతో ఇక తమ పనైపోయిందనేలా నేతలంతా సంతోషంలోమునిగితేలారు. కానీ ఇప్పు డు వారందరికీ ఊహించని షాక్ తగిలింది.. సదరు నేతను బాధ్యతల నుంచి తప్పించడంతో, ఇక్కడి నేతల బాధ వర్ణనాతీతంగా మారింది.
కాంగ్రెస్లో పదవులంటేనే..
కాంగ్రెస్లో పదవులు దక్కాలన్నా, పనులు కావాలన్నా అంత తేలిక కాదనే చర్చ గతంలోనే ఉంది. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మరింత కష్టంగా ఉంటుంది. ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో పదవులు ఆశించిన నేతలకు ఓ కీలక నేత ఆశా‘దీపం’లా కనిపించారు. ఇక ఇంకేముంది.. ఆ నేతకు భారీ మొత్తంలో ముట్టజెప్పినట్టుగా ప్రచారం జరుగుతున్నది. పదవులను బట్టి చెల్లింపుల కార్యక్రమం చేపట్టినట్టుగా తెలుస్తున్నది. కొందరైతే కొట్లలోనే ముట్టజెప్పినట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఎమ్మెల్యేలు, బడా నేతలు కూడా ఇందులో ఉన్నట్టు చర్చ సాగుతున్నది. ఇక ఇటీవల ఆ నేతను బాధ్యతల నుంచి తప్పించడంతో తమ పరిస్థితి ఏంటని నేతలు మదనపడుతున్నట్టుగా సమాచారం. ఇప్పుడీ వ్యవహారం కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది.