హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు జలాశయం గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు. 0.5 మీటర్ల ఎత్తు మేరకు పది గేట్లను ఎత్తి 30వేలకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. అలాగే నిర్మల్ గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు సైతం వరద వచ్చి చేరుతున్నది. దీంతో నీటిని అధికారులు దిగువకు వదిలారు.
కడెం నారాయణరెడ్డి జలాయశం తొమ్మిది గేట్లను ఎత్తివేశారు. కడెం జలాయశం పూర్తినీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 694.175 అడుగులు ఉన్నది. జలాశయానికి ఇన్ఫ్లో 64వేల క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 64వేల క్యూసెక్కులుగా ఉన్నది. నిర్మల్ సారంగాపూర్ మండలం స్వర్ణ జలాశయంలోకి వరద కొనసాగుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1,182 అడుగులున్నది. 3,700 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా.. అదేస్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు.