మెదక్ టౌన్‌కు చెందిన రామచంద్రం గౌడ్ (పేరు మార్చాం) వయసు 80 ఏండ్లు. కల్తీ కల్లు విక్రయం కేసులో అతన్ని జైలుకు పంపారు. నాలుగు నెలల తర్వాత మరో కేసులో ఎక్సైజ్ పోలీసులకు నిషేధిత క్లోరో హైడ్రేడ్ (సీహెచ్) దొరికింది. జైల్లో ఉన్న రామచంద్రంగౌడ్పై ఈ కేసు అక్రమంగా బనాయించారు. ఈ కేసులపై అతన్ని జైల్లో వేయడంతో పాటు.. అతని ఆస్తులను అటాచ్ చేశారు. ఇలా అకారణంగా గౌడన్నలను కల్తీ కల్లు పేరుతో కాంగ్రెస్ సర్కార్ వేధిస్తున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): గౌడన్నల మెడపై సర్కారువారి ఎక్సైజ్‌శాఖ వేధింపుల కత్తి పెట్టింది. కల్తీ కల్లు పేరుతో గౌడన్నలను వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నట్టు గౌడన్నలు వాపోతున్నారు. గతంలో గౌడన్నల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టగా.. వాటిని కొనసాగించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్సైజ్, యాంటీ నార్కోటిక్ బ్యూరోల ద్వారా కల్లు దుకాణాల యజమానులను తీవ్రంగా వేధిస్తున్నదని బాధితులు చెబుతున్నారు. కల్లు దుకాణాల్లో నిత్యం పరీక్షలు చేస్తూ.. ఏదో ఒక కారణం చెప్పి కల్లు ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కల్లులో క్లోరో హైడ్రేడ్, డైజోపాం, అల్ప్రాజొలం స్థాయులు అధికంగా ఉన్నాయని చెప్పి.. ఎక్సైజ్, నార్కోటిక్ బ్యూరో అధికారులు మామూళ్లు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారని గీతకార్మికులు చెబుతున్నారు.
ఈత వనాల పెంపుపై శ్రద్ధ కరువు
గౌడన్నల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఈత వనాలను పెంచింది. హరితహారంలో భాగంగా 2023 నవంబర్ నాటికి సుమారు 4 కోట్లకు పైగా ఈత, తాటి మొక్కలను నాటింది. ప్రస్తుత ప్రభుత్వం వాటి ఆలనాపాలనా పట్టించుకోవడం లేదని గౌడన్నలు అంటున్నారు. ఆ వనాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రం మొత్తం స్వచ్ఛమైన నీరా అందించవచ్చని చెబుతున్నారు. వనాలకు అనుగుణంగా కల్లు దుకాణాలకు అనుమతులు ఇవ్వాల్సిందిపోయి.. కల్తీ కల్లు పేరుతో తమను నిత్యం వేధిస్తున్నారని, దుకాణాల సంఖ్యను తగ్గించేస్తున్నారని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గౌడ్ల జోలికొస్తే ఊరుకునేదిలేదు
పదేండ్ల కేసీఆర్ పాలనలో గౌడన్నలను నెత్తిన పెట్టుకుంటే.. ఏడాది కాంగ్రెస్ పాలనలో గీతన్నల మెడపై వేధింపుల కత్తులు వేలాడదీశారు. గీతకార్మికులకు నాటి ప్రభుత్వం అమలుచేసిన ఒక్క పథకం కూడా నేడు అందడం లేదు. గౌడ్లకు కేసీఆర్ మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ఇస్తే.. ఈ ప్రభుత్వం ఉన్న కల్లు దుకాణాలను బలవంతంగా మూయిస్తున్నది. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నది. హైదరాబాద్‌లోని గౌడన్నల ఆత్మగౌరవ పతాక ‘నీరా కేఫ్’ను పట్టించుకునే నాథుడే లేడు. ప్రభుత్వానికి గౌడన్నల తరఫున హెచ్చరిస్తున్నా. గౌడ్ల జోలికొస్తే ఊరుకునేది లేదు. ఎంతవరకైనా తెగిస్తాం. ఖబడ్దార్.
– శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి
గీత కార్మికులపై కేసులు ఇలా…