Sand Mining Policy | హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా మారింది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ. నూతన విధానంతో భారీ ఆదాయం వస్తుందన్న ప్రభుత్వ పెద్దలు, అధికారులు మాటలు తప్పని తేలిపోయింది. ఖజనాకు కాసుల గలగల ఏమోగానీ వెలవెలబోయేలా చేసింది. కొత్త ఇసుక పాలసీ తలకిందులైంది. భారీ రాబడి సంగతి పక్కన పెడితే ఆదాయం తగ్గిపోయింది. ప్రజలపై టన్ను ఇసుకకు రూ.500 వరకు అదనపు భారం మోపినప్పటికీ ప్రభుత్వానికి రావాల్సినంత ఆదాయం రాలేదు. నిరుడితో పోల్చుకుంటే రూ.100 కోట్లకుపైగా ఆదాయం తగ్గిపోయింది. అధికారుల అత్యుత్సాహం ఫలితంగా ఇసుకకు కృత్రిమ కొరత ఏర్పడి నిర్మాణరంగంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడింది… కొత్త ఇసుక పాలసీ బెడిసికొట్టింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకం ద్వారా టీజీఎండీసీకి ఏటా సుమారు రూ.800 కోట్లకుపైగా ఆదాయం సమకూరేది. మార్కెట్లో ఎప్పుడూ ఇసుకకు కొరత ఏర్పడలేదు. బహిరంగ మార్కెట్లో పుష్కలంగా ఇసుక లభించేది. ఇసుక సరఫరాదారుల మధ్య పోటీ ఉండడంతో ఇసుక ధర టన్నుకు రూ.1,400 దాటలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితి తారుమారైంది. అక్రమాలను అరికడతామంటూ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చింది. తనిఖీల పేరుతో ఇసుక క్వారీలు సజావుగా నడవకుండా చేశారు. ఇసుక లారీలపై ఆంక్షలు విధించారు. వినియోగదారులే నేరుగా బుకింగ్లు చేసుకోవాలనే నిబంధన విధించారు.
ఆన్లైన్ బుకింగ్లు జరగకుండా సాంకేతిక సమస్యలు సృష్టించి దళారులను రంగంలోకి దింపారు. ఇసుకబజార్లను ఏర్పాటుచేసి అధికారికంగానే రూ.1,800 ధర ఖరారు చేశారు. జీఎస్టీ, రవాణా ఖర్చులు కలుపుకొని టన్ను ఇసుక ధర రూ.2,000 దాటిపోయింది. ఒకప్పుడు రూ.1,400లకు ఇంటి వద్దకు చేరాల్సిన ఇసుకకు ఇప్పుడు రూ.2,000 ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. అయినా గతంలో మాదిరిగా అందుబాటులో ఉండడంలేదు. శాండ్బజార్లలో నాసిరకం ఇసుకను ఉంచడంతో వినియోగదారులకు నాణ్యమైన ఇసుక దొరకడమే గగనమైంది. కొత్త ఇసుక పాలసీ బెడిసికొట్టినా ప్రభుత్వంలో చలనం రాలేదని నిర్మాణరంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం వినియోగదారులపై భారం మోపినా ఖజానాకు రాబడి మాత్రం పెరగలేదు. గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లకుపైగా ఆదాయం తగ్గిపోయింది. ప్రతినెలా సగటున రూ.70కోట్ల వరకూ ఆదాయం రావాల్సి ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్లో రూ. 40 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.
శనివారం టీజీఎండీసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఇసుక ఆదాయం తగ్గడంపై సీఎం రేవంత్రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. కొత్త పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు పరిస్థితి తలకిందులు కావడంతో తమను బాధ్యులు చేయడమేంటని కొందరు అధికారులు వాపోతున్నారు. ఆదాయం ఎలా పెంచాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. శాండ్ బజార్లలో ఇసుక ధరలు తగ్గించాలా? బహిరంగ మార్కెట్లో ఇసుక మరింత అందుబాటులోకి వచ్చేలా చేయాలా? అని అధికారులు ఆలోచనలో నిమగ్నమైనట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం, అధికారులు ఇసుక కృత్రిమ కొరతను సృష్టించడం మానుకోవాలని ప్రజలు, నిర్మాణదారులు కోరుతున్నారు.
ఇసుక ధర రూ.2,000లకు చేరుకోవంతో భవననిర్మాణాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్నది. బడా బిల్డర్లు వినియోగదారులపై భారంమోపి తమ ఖర్చులు రాబట్టుకుంటారు. కానీ వ్యక్తిగత గృహాలు నిర్మించుకునే మధ్యతరగతి ప్రజల బడ్జెట్ తారుమారవుతున్నది. చాలామంది నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. 100 గజాల్లో రెండు గదుల ఇల్లు నిర్మించుకునేవారిపై సైతం ఇసుక ధర పెరగడంవల్ల రూ.లక్షకుపైగా అదనపు భారం పడినట్టు చెప్తున్నారు.