నల్లగొండ: ఎగువన భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్నది. దీంతో అధికారులు ముందస్తుగా ఎనిమిది గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5733.36 క్యూసెక్కుల వరద వస్తుండగా, 17,809.25 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. మూసీ పూర్తిస్థాయిస్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 637.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 4.46 టీఎంసీలు. ఇప్పుడు 2.67 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో మూసీ నదిలోకి వరద పోటెత్తింది. నేడు వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. నదిలో భారీగా వరద వస్తుండటంతో హైదరాబాద్లోని జియాగూడవద్ద మూసీ పొంగిపొర్లుతున్నది. చాదర్ఘాట్ లోలెవల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తున్నది. అదేవిధంగా మూసారాంబాగ్ చాందిని బ్రిడ్జిపైనుంచి వరద వెళ్తున్నది. దీంతో అధికారులు చాదర్ఘాట్ లోలెవల్ బ్రిడ్జితోపాటు మూసారాంబాగ్ వంతెనపైనుంచి రాకపోకలను నిలిపివేశారు. చాదర్ఘాట్లోని మూసానగర్, శంకర్ కాలనీ బస్తీలను వరద ముంచెత్తింది. దీంతో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.