నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 17: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. 95 జిలెటిన్ స్టిక్స్, 10 డిటొనేటర్స్ను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌లోని కంఠేశ్వర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓ ఇంట్లో అక్రమంగా నిషేధిత పేలుడు పదార్థాలు ఉన్నట్టు సమాచారం అందింది. సీపీ నాగరాజు ఆదేశాల మేరకు రూరల్ పోలీసులు కేసీఆర్ కాలనీ, న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని (ఎంఐజీ-122) ఇంట్లో సోదాలు నిర్వహించగా 95 జిలిటెన్ స్టిక్స్, 10 డిటొనేటర్స్ లభ్యమయ్యాయి. వాటిని సీజ్ చేసిన పోలీసులు ఆ ఇంట్లో నివాసముంటున్న బొంత సుగుణను అదుపులోకి తీసుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన ప్రసాద్‌గౌడ్ రివాల్వర్ కొనేందుకు ఆమె ఆర్థిక సహాయం చేసింది. ప్రసాద్‌గౌడ్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉండగా, సుగుణ బెయిల్‌పై బయటకు వచ్చింది. ఈ సామగ్రిని ప్రసాద్‌గౌడ్ తనకు ఇచ్చి ఇంట్లో దాచాలని, బయటకు రాగానే ఎమ్మెల్యే సంగతి చూసుకుందామని చెప్పినట్టు సుగుణ పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. దీంతో సుగుణపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు.