మంచిర్యాల, నమస్తే తెలంగాణ/ కాళేశ్వరం, ఏప్రిల్ 24: ప్రాణహిత పుష్కరాలు పరిసమాప్తమయ్యాయి. 12 రోజులపాటు నదీమాతకు వైభవంగా పూజలు కొనసాగాయి. చివరి రోజైన ఆదివారం పుష్కరస్నా నం ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి, కౌటాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పుష్కర ఘాట్లు 12 రోజులపాటు భక్తులతో కిటకిటలాడాయి. పెద్దలకు పిండ ప్రదానాలు నిర్వహించారు. నదీ స్నానమాచరించి మొక్కులు తీర్చుకొన్నారు. మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకొన్నారు. నదీమతల్లికి చీర, సారె సమర్పించారు. కాళేశ్వర త్రివేణి సంగమం లో రాత్రి 7:30 గంటలకు ప్రధాన అర్చకులు, వేద పండితులు, అధికారులు ఆలయ సంప్రదాయాలతో ప్రాణహిత నదికి వెళ్లారు. నదీమ తల్లికి పంచహారతి ఇచ్చి.. చీర, సారె సమర్పించారు.