హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఇందిరా మహిళా శక్తి కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఆదేశించింది. సకాలంలో జీతాలు విడుదల చేయకపోవడంతో వారి జీవనం ఎలా కొనసాగుతుందని ప్రశ్నించింది. జీతాలు రాకపోవడంతో వాళ్లు మానసికంగానూ కుంగిపోయే ప్రమాదమున్నదని హెచ్చరించింది. ప్రభుత్వం తమకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని బాధితులు హెచ్ఆర్సీని ఆశ్రయించడంతో ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఇందిరమ్మ ఇండ్లకు ఆధార్ ఆధారిత చెల్లింపులు
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఆధార్ అనుసంధానం ద్వారా చెల్లింపులు చేయనున్నట్టు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం వెల్లడించారు. బిల్లులు సకాలంలో లబ్ధిదారులకు అందేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగంలో లేని అకౌంట్ నంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లలో తప్పులతో చెల్లింపులు సరిగా జరగడం లేదనే ఫిర్యాదులతో ఇలా నిర్ణయించినట్టు తెలిపారు.