కొల్లాపూర్, మార్చి 30: ఉగాది పండుగ (Ugadi) తెలుగు ప్రజలకు ఎంతో విశిష్టమైనది. అయితే ఇది తెలుగు వారి పండుగ మాత్రమే కాదు. యుగ ఆరంభానికి నాంది అని చెప్పొచ్చు. కాల గమనంలో భాగంగా వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు తెలుగు నూతన శకం ప్రారంభమవుతుంది. ఈరోజు వేద పండితులు గ్రహ నక్షత్రల స్థితిని బట్టి ఈ సంవత్సర కాల స్థితిని భవిష్యత్తును పంచాంగం ద్వార వివరిస్తుంటారు. తెలుగు ప్రజలు తమ పేర్ల బలం గురించి పంచాంగం ద్వారా తెలుసుకొని తమ కార్యసాధన మొదలు మొదలు పెడతారు. రైతులు ఏ పంటకు బలం ఉంటుందో తెలుసుకుని తమ పశు సంపదను సుందరంగా అలంకరించి తమ వ్యవసాయ పొలాలలో కొద్దిసేపు వ్యవసాయ పనులు చేస్తారు. ఉగాది పర్వదినాన ప్రతి తెలుగువారి ఇంట పచ్చటి మామిడి తోరణాలతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాల తో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది.
బ్రహ్మ దేవుడి సృష్టి ఆరంభం
ఉగ అనగా నక్షత్రం ఆది అనగా ఆరంభం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సృష్టి ఆరంభముగా చెప్పవచ్చు బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున గ్రహ నక్షత్రాల గమనంతో సృష్టిని ప్రారంభించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. సృష్టి ప్రారంభంతోనే యుగాలకు శ్రీకారం పడినట్లు అస్తికుల వాదుల విశ్వాసం.
షడ్రుచుల సమ్మేళనం
ఉగాది పండుగ పర్వదినాన ప్రతి వారి వెంట ఉండే షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి జీవిత పరమార్థాన్ని కూడా తెలియజేస్తుంది. షడ్రుచులకు కారణమైన వేప పువ్వు, మామిడికాయ, బెల్లం, చింతపండు, ఉప్పు, మిరపకాయ కలయికలతో కూడిన ఉగాది పచ్చడి జీవితంలో కష్టనష్టాలు సుఖదుఃఖాలు ఇమిడి ఉన్నట్లు తెలియజేస్తుంది.
ఉగాది పచ్చడి తయారీ
ఈ పచ్చడి కొరకు అరటి పళ్లు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, ఉప్పు,మిరపకాయ, బెల్లం మొదలైనవి వాడుతారు.
ముందుగా వేపపువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల తర్వాత దాని గుజ్జును వేరుచేయాలి. మామిడికాయను, మిరపకాయలు, బెల్లాన్ని కూడా ముక్కలుగా చేసుకొని దాన్ని చింతపండు గుజ్జులో కలపాలి.ఈ మిశ్రమంలో చివరిగా ఒక అర స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమైపోయినట్టే. కష్ట సుఖాలను జీవితంలో చవిచూడాలనే నిజాన్ని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది.