ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : జిల్లా కేంద్రానికి కేవలం 4 కిలో మీటర్లు దూరంలో ఉన్న గుండి గ్రామానికి (Gundi village) వంతెన లేక గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పెద్ద వాగుపై 2006లో వంతెన( Bridge) నిర్మాణం ప్రారంభించగా నేటికీ పిల్లర్ల దశలోనే మగ్గుతోంది. దీంతో ఆ గ్రామస్థుల వంతెన కల కలగానే మిగిలిపోతొంది. వర్షా కాలంలో గ్రామానికి జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఏదైనా అత్యవసరమైతే నాటు పడవ, థర్మకోల్తో చేసిన తెప్పలే ( Rafts ) గ్రామస్థులకు దిక్కవుతున్నాయి.
గ్రామస్థులు అనేక సార్లు ఫిర్యాదులు చేసిన, ధర్నాలు చేసిన ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వంతెన పూర్తి అయ్యేవరకు ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్థులు బోర్డులు పెట్టగా అధికారులు సర్ది చెప్పి ఎన్నికలు జరిపించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి గా ఉన్న సీతక్క గ్రామాన్ని సందర్శించి వాగులో నడిచి చూసి వంతెనను పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు.
తాజాగా గ్రామస్థులు. శుక్రవారం థర్మకోల్తో చేసిన తెప్ప సహాయంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిక్కు బిక్కుమంటూ వాగు దాటారు. ఇంకెన్నాళ్ళు మాకి దుస్థితి అంటూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైన వంతెనపై ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణం పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.