హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవస్థాపకుడు రామోజీరావు మరణించారని, ఆయనపై అభియోగాలను కుటుంబసభ్యులకు ఆపాదించేందుకు వీల్లేదంటూ హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. రామోజీ కుటుంబసభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చెల్లవని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ హైకోర్టులో వాదించారు. తండ్రి తప్పు చేస్తే అందుకు కొడుకును శిక్షించడానికి వీల్లేదన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున కర్త రామోజీరావు మాత్రమే అవకతవకలకు బాధ్యుడవుతాడని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు, హెచ్యూఎఫ్ కింద వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోనప్పుడు ఆ తప్పులకు బాధ్యత వహించాలి కదా అని ప్రశ్నించింది.ఈ నెల 28కి విచారణ వాయిదా వేస్తూ జస్టిస్ శ్యామ్కోషి, జస్టిస్ సుజన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.