హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ఇచ్చిన హామీల మేరకు అందరి అభిప్రాయాలను సేకరించి వచ్చే నెల 2వ తేదీ నాటికి ఒక కొలికి తీసుకొస్తామని వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ, జర్నలిస్ట్స్ హౌసింగ్, డెకన్ జర్నలిస్ట్స్, తెలంగాణ హౌసింగ్ సొసైటీలతో మంత్రి సమావేశం నిర్వహించారు. జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ మినహా మిగిలిన మూడు సొసైటీల్లో సుమారు 2,424 మంది అర్హులైన జర్నలిస్టులు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అన్ని సొసైటీలు కలిపి ఒకే వేదికపైకి వచ్చి జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల్లో సభ్యులు కాని అర్హులైన జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ఎలాంటి విమర్శలు, అనుమానాలకు తావు లేకుండా స్థలాల మంజూరు జరిగేలా అందరూ సహకరించాలని హౌసింగ్ సొసైటీ సభ్యులను కోరారు. దశాబ్దాల కాలంగా పెం డింగ్‌లో ఉన్న ఇండ్ల స్థలాల సమస్యను పరిషరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని జూన్ 2నాటికి కొలికి తీసుకొస్తామని తెలిపారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సానుకూల దృక్పథంతో ఉన్నారని, ఫ్యూచర్‌సిటీలో ఎమ్మెల్యేలు, బ్యూరోక్రాట్స్తోపాటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకూ ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వారికి సూచనప్రాయంగా వెల్లడించి సొసైటీలో ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. 18 ఏండ్ల క్రితమే ఇంటి స్థలాల కోసం ప్రతిసభ్యుడు రూ.2 లక్షల చొప్పున చెల్లించారని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇండ్ల స్థలాల కేటాయింపులో తమ సొసైటీకి ప్రత్యేక ప్రాధా న్యం ఇవ్వాలని ఈ సందర్భంగా సభ్యులు మంత్రిని కోరారు. కానీ, అవే భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ కేటాయించే అవకాశంలేదని, అవి కేటాయిస్తే మళ్లీ కోర్టు సమస్యలు తలెత్తుతాయని మంత్రి స్పష్టంచేశారు. సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ జీ ముకుందరెడ్డి, సీపీఆర్వో మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.