హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): హౌసింగ్ బోర్డు ఆధీనంలోని ఖాళీ ప్లాట్లు, భూముల వేలానికి మరోసారి రంగం సిద్ధమైంది. ఈ నెల 6 నుంచి 10 వరకు జీహెచ్ఎంసీతోపాటు శివారు ప్రాంతాల్లోని ప్లాట్లు, ఫ్లాట్ల విక్రయానికి హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో భాగం గా సోమవారం చింతల్, నిజాంపేట, బాచుపల్లిలోని 22 రెసిడెన్షియల్ ప్లాట్లు, ఫ్లాట్లను బహిరంగ వేలం వేయనున్నది. చింతల్‌లోని 18 ఎంఐజీ, హెచ్ఐజీ ఫ్లాట్లను, నిజాంపేట, బాచుపల్లిలోని 4 ఖాళీ జాగాలను వేలం వే యనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 7, 8న కేపీహెచ్‌బీలోని 4 వాణిజ్య ప్లాట్లతోపాటు నాంపల్లిలోని 1,148 గజాల ప్లాట్‌ను వేలం వేయనున్నట్టు వెల్లడించింది. 9, 10న చింత ల్, రావిర్యాలలోని కమర్షియల్ భూములను విక్రయించనున్నట్టు తెలిపింది.
టీచర్ల రిటైర్మెంట్ను 65 ఏండ్లకు పెంచాలి : తపస్
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : జాతీయంగా పనిచేస్తున్న అన్ని స్థాయిల టీచర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏండ్లకు పెంచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) కోరింది. జైపూర్‌లో జరుగుతున్న అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్(ఏబీఆర్ఎస్ఎం) జాతీయ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసినట్టు రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ తెలిపారు. ఏడవ వేతన సంఘం సిఫారసులను అమలు చేయాలని, టెట్‌పై సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయడంతోపాటు పలు తీర్మానాలు చేసినట్టు వారు తెలిపారు.