హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): ఒప్పందాన్ని ఉల్లంఘించిన రెండు జాయింట్ వెంచర్ (జేవీ) కంపెనీల నుంచి 18 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నట్టు హౌసింగ్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా ఆర్బిట్రేషన్ అవార్డును అనుసరించి హైదరాబాద్ బండ్లగూడలోని ఇందు ఈస్ట్రన్ ప్రావిన్స్ ప్రాజెక్ట్ లిమిటెడ్ నుంచి 10.41 ఎకరాలు, మధుకాన్ ప్రాజెక్ట్స్ నుంచి 7.32 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నది. గచ్చిబౌలి, కూకట్పల్లి ప్రాంతాల్లోయూనివర్సల్ డెవలపర్స్‌కు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని సస్పెండ్ చేసినట్టు తెలిపింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ హౌసింగ్ బోర్డు 20 జాయింట్ వెంచర్ ప్రాజెక్టులను చేపట్టింది.
ఇందులో 14 ప్రాజెక్టులు పూర్తికాగా మిగతాప్రాజెక్టులు కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఆనాడే నిబంధనలను ఉల్లంఘించిన జాయింట్ వెంచర్ కంపెనీలు.. హౌసింగ్ బోర్డుకు చెల్లించాల్సిన వాటాను ఎగ్గొట్టాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటు అనంతరం దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అప్పట్లో జరిపిన భూ కేటాయింపులను కేసీఆర్ ప్రభుత్వం రద్దుచేసింది. తాజాగా గతంలో నిబంధనలను ఉల్లంఘించిన జాయింట్ వెంచర్ సంస్థల నుంచి హౌసింగ్ బోర్డు ఆర్బిట్రేషన్ ఆదేశాలకు అనుగుణంగా భూములను తిరిగి వెనక్కి తీసుకుంటున్నది. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ జాగాలకు ప్రహరీ నిర్మిస్తున్నది. జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల ద్వారా హౌసింగ్ బోర్డుకు రావాల్సిన రూ.589 కోట్ల రెవెన్యూ వాటాలో ఇప్పటివరకు కేవలం రూ.45 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు.
ఖాళీ స్థలాలకు జియో ట్యాగింగ్
హౌసింగ్ బోర్డు, దిల్‌కు సంబంధించిన ఖాళీ స్థలాలకు జియో ట్యాగింగ్ చేస్తున్నట్టు, 703 ఎకరాల ఖాళీ స్థలాలకు జీపీఆర్ఎస్ సర్వే పూర్తయినట్టు అధికారులు తెలిపారు. హౌసింగ్ బోర్డుకు చెందిన 410 ఎకరాల భూములకు రూ.10 కోట్లతో ప్రహరీ నిర్మాణం చేపట్టినట్టు, అలాగే దిల్‌కు సంబంధించిన 943.52 ఎకరాల భూములకు కూడా రూ.10 కోట్లతో ప్రహరీ నిర్మాణం ప్రక్రియ టెండర్ల దశలో ఉన్నట్టు హౌసింగ్ బోర్డు అధికారులు వివరించారు. హౌసింగ్ బోర్డు ఆధీనంలోని భూములను చట్టవిరుద్ధంగా ఆక్రమించిన వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా తమ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.