ఖైరతాబాద్, సెప్టెంబర్ 29 : ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో లేకున్నా హైడ్రా అన్యాయంగా తమ బతుకులను రోడ్డున పడేసిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెంది న బాధితులు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కిష్టారెడ్డిపేటలోని సర్వే నంబరు 165, 166లో ప్లాట్ నంబర్ 90లో పొదులకూరి కల్యాణ్ అపార్ట్‌మెంట్‌ను నిర్మించగా, ప్లాట్ నంబర్ 92లో గణేశ్ కన్స్ట్రక్షన్స్కు చెందిన వెంకట్‌రెడ్డి పిల్లల వైద్యశాల నిర్మించాడని, ప్లాట్ నంబర్ 74లో ప్రధాన రహదారి పక్కనే 20 ఏండ్ల క్రితం స్థలం కొనుక్కొని కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారని తెలిపారు. గత ఆదివారం హైడ్రా, తహసీల్దార్ పర్యవేక్షణలో ఆ మూడు భవనాలను కూల్చివేశారని, అప్పులు తెచ్చి కట్టుకు న్న భవనాలను కండ్లముందే నేలమట్టం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. 1984లోనే లే అవుట్ అయ్యిందని, ఎల్ఆర్ఎస్ కూడా ఉన్నదని చెప్పారు.
ఆర్నెళ్ల క్రితం తమ స్థలం లో ఉన్న గోడను తహసీల్దార్ కూల్చివేస్తే హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవద్దని, యజమానుల ఇండ్లను కూల్చవద్దని కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పారు. కొద్ది రోజులకే స్లాబ్ తొలగించడంతో కోర్టు ధిక్కరణ కేసు వేశామని, అప్పటి నుంచి అధికారు లు కక్షగట్టారని కల్యాణ్, వెంకట్‌రెడ్డి, మధుసూదన్ వాపోయారు. అన్నిరకాల రుజువు లు, సాక్ష్యాలను కోర్టులో సమర్పించగా, తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపారు. కోర్టులో కేసు ఉండగా,గృహాలను కూల్చివేసి నిరాశ్రయులను చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారుల వ్యవహారంపై కోర్టుకు వెళితే హైడ్రా, తహసీల్దార్లకు మొట్టికాయలు వేస్తూ నోటీసులు జారీ చేసిందని, 30న హాజరు కావాలని ఆదేశించిందని తెలిపారు. కూల్చివేతలతో రూ. 5 కోట్ల నష్టం జరిగిందని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తంచేశారు.
ఓ అధికారికి రెండు కోట్ల ఇవ్వనందుకే!
మొదటి నుంచి ఓ అధికారి తమ నిర్మాణా లు ప్రభుత్వ స్థలంలో ఉన్నాయని, రూ.2 కోట్లు ఇస్తే పట్టించుకోమని చెప్పారని బాధితుడు వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఎలాంటి సర్వే, డీమార్కింగ్ చేయలేదని, ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో కూడా తమ నిర్మాణాలు లేవని, అన్ని అనుమతులు ఉన్న పట్టా భూమి అని, డబ్బులు ఇవ్వనందుకే తమపై కక్షగట్టి కూల్చివేశారని మీడియాకు తెలిపారు. సదరు అధికారే హైడ్రాను తప్పుదోవపట్టించి భవనాలు కూల్చివేయించారని ఆరోపించారు.