హైదరాబాద్, అక్టోబర్ 10, (నమస్తే తెలంగాణ)/సిటీబ్యూరో: మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేదలను నిర్వాసితులను చేయడమే కాదు.. ప్రార్థనా మందిరాలనూ కబళించనున్నదా? ఎన్నో ఏండ్ల ప్రాశస్త్యం కలిగిన చారిత్రాత్మక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోనున్నాయా? లక్షలాది మంది ప్రజలు ప్రార్థించే మందిరాలు కనుమరుగుకానున్నాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మూసీ రివర్బెడ్, బఫర్‌జోన్ పరిధులే కాకుండా వాటిని దాటుకొని వెలుపల ఉన్న నిర్మాణాలపైనా అధికారులు ఆర్బీ-ఎక్స్ మార్క్ వేయడంపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పేట్లబురుజు ప్రాంతంలోని గురుద్వార్, హనుమాన్ ఆలయాలతోపాటు పలు ఇండ్లకు ఆర్బీ-ఎక్స్ మార్క్ వేయడంపై పలువురు ఏకంగా కోర్టుకెక్కారు. ఆ ప్రాంతానికి చెందిన హేమసుందర్ సింగ్దాస్ సహా మరో 15 మంది హైకోర్టులో శుక్రవారం అత్యవసర హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు తమ ప్రాంతంలోని ఇండ్లను, ఆలయాలను కూల్చివేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. హైకోర్టుకు దసరాకు సెలవులు ముగియనున్నందున గురువారం అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 14న హైకోర్టు పునఃప్రారంభం అయ్యాక విచారణ జరిగే అవకాశం ఉన్నది.
నిజాం ఇనాంగా ఇచ్చిన భూమి
గురుద్వారాకు 4.20 ఎకరాల భూమిని నాడు నిజాం కాలంలో కేటాయించినట్టు బాధితులు పేర్కొన్నారు. యాత్రికుల సౌకర్యార్థం అక్కడ ధర్మశాల కూడా నిర్మాణం జరిగింది. గురుద్వారాకు నిజాం పాలనలో పన్ను మినహాయింపు కూడా లభించింది. గత 80 ఏండ్లుగా వారంతా గురుద్వారాకు సమీపంలోని ఇండ్లలోనే నివసిస్తున్నారు. విద్యుత్తు, తాగునీరు ఇతర సౌకర్యాలకు బిల్లులు చెల్లిస్తున్నారు. పిటిషనర్లకు టైటిల్ డీడ్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్ సిటీకి లోపల, మూసీ సరిహద్దు గోడకు వెలుపల ఉన్న భూమిలోని తమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలని, తమ నిర్మాణాల కూల్చివేతలు చట్టవ్యతిరేకమని ప్రకటించాలి.. అని పిటిషన్లో హైకోర్టును కోరారు. ఆ ప్రాంతంలోనే హనుమాన్ ఆలయం కూడా ఉన్నది. అటు గురుద్వారా, ఇటు హనుమాన్ ఆలయాలను కూల్చవద్దని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వారు కోర్టును కోరారు.