పెద్దపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తున్నదని, రాజ్యాంగాన్ని రక్షిస్తానని రాహుల్ గాంధీ అంటుంటే రేవంత్‌రెడ్డి మాత్రం ఖూనీ చేస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా పార్టీ నాయకురాలు దాసరి ఉషను పోలీసులు హౌజ్ అరెస్టు చేసిన విషయాన్ని తెలుసుకొన్న ఆయన శనివారం ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. హౌజ్ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఏ ప్రాంతలోనైనా మంత్రులు పర్యటించే సందర్భంలో సమస్యల పరిష్కారం కోసం నాయకులు, ప్రజలు వినతి పత్రాలు ఇచ్చే సంప్రదాయం ఉంటుందని, కానీ పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఎవరికీ స్వేచ్ఛలేకుండా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ అంటే అంత భయమెందుకని ప్రశ్నించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకు ఆయన పలు ప్రశ్నలను సంధించారు. బడ్జెట్లో పెట్టిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నిధులు మంజూరు చేశారా? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2023 డిసెంబర్ తర్వాత ఒక లోనైనా ఇచ్చారా? ఈ అంశాలపై చర్చకు సిద్ధమా? హైదరాబాద్‌లోని 125 అడుగుల అంబేదర్ విగ్రహం వద్ద చర్చకు తాను సిద్ధమని, భట్టి, రేవంత్ సిద్ధమా? అని సవాల్ విసిరారు.