దోమలపెంట, డిసెంబర్ 11 : నాగర్‌కర్నూల్ జిల్లాలో కూల్చివేతలు హడలెత్తించాయి. అమ్రాబాద్ మండలం దోమలపెంట బస్టాండ్ సమీపంలో 15 ఏండ్ల కిందట బీఆర్ఎస్ నేత, మాజీ ఉపసర్పంచ్ కటకం మహేశ్ షెడ్డు నిర్మించి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. సమీపంలోనే మరో షెడ్ ఏర్పాటు చేసి చాయ్, టిఫిన్ దుకాణం కొనసాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం పంచాయతీ అధికారులు రెండు నిర్మాణాలు అక్రమమని మహేశ్‌కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా.. డిసెంబర్ 9 వరకు స్టే విధించింది. స్టే ముగియడంతో మున్సిపల్ అధికారులు బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు జేసీబీతో వెళ్లారు. కోర్టులో కేసు ఉండగా ఎలా కూల్చివేస్తారని పోలీసులు, గ్రామ కార్యదర్శిని మహేశ్ నిలదీశాడు. నిర్మాణాలు తొలగించవద్దని కుటుంబ సభ్యులు జేసీబీకి అడ్డుపడి ప్రాధేయపడినా కార్యదర్శి, పోలీసులు వినిపించుకోలేదు. మహేశ్‌తోపాటు కుటుంబ సభ్యులను ఉదయం 6 గంటలకు ఈగలపెంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యదర్శి దగ్గరుండి.. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగించారు. పోలీస్ స్టేషన్‌ను వచ్చిన మహేశ్ కుటుంబం చేరుకొని నేలమట్టమైన నిర్మాణాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పంచాయతీ కార్యదర్శి భీముడిని వివరణ కోరగా.. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చి అక్రమ నిర్మాణాలను తొలగించామని తెలిపారు.
బీఆర్ఎస్ నేతల నిరసన
దోమలపెంటలో చిరు వ్యాపారం చేసుకొని జీవించే మహేశ్ హోటల్స్ కూల్చివేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు నేలమట్టమైన షెడ్ల వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మాజీ ఎంపీటీసీ తిమ్మన్న, శేఖర్, ప్రసాద్, వెంకట్, గణేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాజకీయ కక్షతోనే కూల్చివేతలు : మహేశ్
దోమలపెంటలో ఎన్నో కట్టడాలు అక్రమంగా నిర్మించారని, వాటిని తొలగించకుండా తాను కట్టుకున్న నిర్మాణాలు ఎందుకు తొలగించారని మాజీ ఉపసర్పంచ్ మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోర్టులో కేసు ఉండగానే ఎలా కూల్చుతారని నిలదీశాడు. తాను బీఆర్ఎస్లో ఉండడంవల్లే అధికార పార్టీకి చెందిన వారు కక్షతో కూల్చివేయించారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక.. ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు.