హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతూ ఉన్నత విద్యనభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు చెల్లించాల్సిన మెస్, కాస్మోటిక్ చార్జీలను 25 శాతం పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వెల్ఫేర్‌తోపాటు మాడల్ సూళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, సాధారణ గురుకులాలన్నీ కలిపి 3,214 హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 3వ తరగతి నుంచి పీజీ వరకు దాదాపు 8,59,959 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు.
మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేక భేటీ
డైట్ చార్జీలను ప్రభుత్వం ఐదేండ్లకోసారి పెంచుతున్నది. మార్కెట్ రేట్ల ఆధారంగా ధరలను నిర్ణయిస్తుంది. గతంలో 2012లో డైట్, కాస్మోటిక్ చార్జీలను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేవలం 10 శాతమే పెంచగా, రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వం 2016-17లో 25 శాతం పెంచింది. ఐదేండ్లు గడుస్తుండటంతో సీఎం కేసీఆర్ మార్గదర్శకాల మేరకు మంత్రివర్గ ఉపసంఘం బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో ప్రత్యేకంగా భేటీ అయింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు రాహుల్‌బొజ్జా, బుర్రా వెంకటేశం, క్రిస్టినా జడ్ చోంగ్తూ, రోనాల్డ్ రోస్, షఫియుల్లా, మల్లయ్యభట్టు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు చెల్లిస్తున్న చార్జీలపై, పెరిగిన మార్కెట్ ధరలపై చర్చించారు. ప్రస్తుతం చెల్లిస్తున్న మెస్, కాస్మోటిక్ చార్జీలను 25 శాతం మేరకు పెంచాలనే నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. డైట్ చార్జీల పెంపుతో ఏటా అదనంగా దాదాపు రూ.300 కోట్ల నిధులు వెచ్చించాల్సి వస్తున్నది. మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలపై విద్యార్థి సంఘాల నేతలు, హాస్టల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
హాస్టళ్లను తనిఖీ చేయాలి: మంత్రి హరీశ్‌రావు
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకతోపాటు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీలను చెల్లిస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం భేటీ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న డైట్ చార్జీలకు 25 శాతం మేర పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో వసతిని కల్పిస్తున్నామన్నారు. వారికి మరింత మెరుగైన వసతుల కల్పన లక్ష్యంతో పది కంటే తకువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న హాస్టళ్లను వాటికి సమీపంలోని అదే శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్షేమ గురుకులాల్లో కలిపే అవకాశాన్ని అధికారులు పరిశీలించాలని సూచించారు. నెలలో తరచుగా కలెక్టర్ మొదలు తాలూకా స్థాయి యంత్రాంగం వరకు అందరూ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను తనిఖీ చేస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేసి అకడే నిద్రించాలని ఆదేశించారు.
మంత్రివర్గ ఉపసంఘానికి కృతజ్ఞతలు
మెస్ చార్జీలు పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయడం హర్షణీయం. 25 శాతం పెంచాలని నిర్ణయించడం ఆనందంగా ఉన్నది. తద్వారా విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం అందుతుంది. తెలంగాణలో దళిత బహుజన విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడినట్టవుతుంది. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు సిఫారులు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
దేశంలోనే అత్యధిక చార్జీలు
మెస్ చార్జీలు పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలు విద్యార్థులకు వరం. లక్షలాది మంది పేద బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే అత్యధిక డైట్ చార్జీలున్నాయి. విద్యార్థులందరి పక్షాన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్
హర్షణీయం : గెల్లు శ్రీనివాస్
సంక్షేమ హాస్టళ్లలో మెస్‌చార్జీలు పెంచాలని ప్రతిపాదించడంపై బీఆర్ఎస్వీ విభాగం అధ్య క్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమానికి తెలంగాణలోనే అధిక నిధులు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు.
నిధుల కేటాయింపు
ఇప్పటివరకు అన్ని క్యాటగిరీల్లో కలిపి ప్రభుత్వం వెచ్చిస్తున్నది రూ.1053.84 కోట్లు
25 శాతం పెంపు వల్ల వెచ్చించాల్సిన నిధులు రూ.1,329.02 కోట్లు
ఏటా అదనంగా దాదాపు రూ.300 కోట్లు