హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు జీఐ ట్యాగ్(భౌగోళిక గుర్తింపు) సాధించడం ద్వారా ఉత్పత్తులకు దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెంచడంపై శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన వర్సిటీ(ఎస్కేఎల్టీజీహెచ్యూ) దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో తాండూరు పప్పుకు జీఐ గుర్తింపు రాగా.. తాజాగా వరంగల్ చపాటా మిర్చికి దక్కింది.
త్వరలో కొల్లాపూర్ మామిడి, జగిత్యాల పొడుగు బీరకాయలు, నల్లగొండ పచ్చడి దోసకాయతోపాటు ఆర్మూరు పసుపు, బాలానగర్ సీతాఫలాలకు జీఐ ట్యాగ్ కోసం వర్సిటీ శాస్త్రవేత్తలు కసరత్తు ప్రారంభించారు. ముందుగా బాలానగర్ సీతాఫలం, ఆర్మూరు పసుపునకు 20 రోజుల్లో జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేయనున్నట్టు వీసీ రాజిరెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా శాస్త్రవేత్తలను నియమించామని చెప్పారు. ప్రధాన పరిశోధకుడిగా డాక్టర్ పిడిగం సైదయ్య, సభ్యుడిగా శాస్త్రవేత్త మహేందర్ తదితరులు వ్యవహరిస్తారని చెప్పారు.
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ సీతాఫలానికి ప్రత్యేక గుర్తింపు ఉందని వీసీ రాజిరెడ్డి పేర్కొన్నారు. రుచి, నాణ్యతకు పేరొందిన ఆ సీతాఫలాలను ఇతర జిల్లాలతోపాటు పొరుగు రాష్ర్టాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారని తెలిపారు. సీతాఫలం ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు వికారాబాద్, రం గారెడ్డి జిల్లాలకు విస్తరించిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో పోమల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో 20 రోజుల్లో జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేయనున్నట్టు చెప్పారు.
ఆర్మూర్ పుసుపునకు ప్రత్యేక గుర్తింపు ఉందని, నిజామాబాద్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన పంటగా సాగుచేస్తున్నట్టు చెప్పారు. జీఐ ట్యాగ్ దరఖాస్తులో భాగంగా మొక్క లక్షణాలు, సాగు విస్తీర్ణం, భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై సమాచారం సేకరిస్తారని పేర్కొన్నారు. జీఐ ట్యాగ్ పొందితే ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడించారు.