తొమ్మిదేండ్లలో 12 వేల కోట్లు
ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో ఏకంగా రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
- పదేండ్లలో కాంగ్రెస్ చేసిన ఖర్చు 934 కోట్లే
- షాదీముబారక్ ముస్లిం యువతులకు వరం
- గురుకులాలతో మైనార్టీలోవెలుగులు
- వక్ఫ్ భూములను కాపాడింది, దర్గాలను అభివృద్ధి చేసింది కేసీఆరే
- తెలంగాణ అంటే గంగా జమునా తెహ్జీబ్
- ముస్లిం మైనార్టీలంతా బీఆర్ఎస్ వైపే
- ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో హోంమంత్రి మహమూద్ అలీ
ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో ఏకంగా రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో ముస్లింల సంక్షేమానికి ఏ రాష్ట్రమూ ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసిన దాఖలాలే లేవని స్పష్టం చేశారు. ఉద్యమ నేత సీఎం కేసీఆర్ సారథ్యంలో పోరాడి సాధించుకున్న తెలంగాణలోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలోని ముస్లిం సోదరులంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు ఇవీ..
కాంగ్రెస్ హయాంలోనే సంక్షేమం నిజమేనా?
అది ముమ్మాటికీ తప్పు. ముస్లింలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో మైనార్టీల సంక్షేమానికి రూ.934 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కానీ, గత 9 ఏండ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12,000 కోట్లు ఖర్చు చేసింది. ఇంతటి ఖర్చు దేశంలో ఏ ప్రభుత్వమూ చెయ్యలేదు. దీనిపై చర్చ కోసం ఎక్కడికి రమ్మన్నా నేను సిద్ధమే.
షాదీముబారక్‌తో ఎంతమంది లబ్ధిపొందారు?
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదేండ్లలో 700 మంది ముస్లిం యువతుల పెండ్లికి రూ.25 వేలు చొప్పున మొత్తం రూ.2 కోట్లు ఖర్చు చేశారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం 2,77,167 మంది పెండ్లికి రూ.2,347 కోట్లు ఖర్చు చేసింది. ఈ తేడాను ముస్లిం సోదరులు గమనించాలి. షాదీముబారక్‌తోపాటు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది.
ఇమామ్, మౌజం కోసం చేసిన పోరాటాలు?
ఇమామ్, మౌజంలను ఆదుకోవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వయంగా నేనే ధర్నాలు చేశాను. ఎందరినో కలిసినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 10 వేల మంది ఇమామ్, మౌజంలకు ప్రతినెలా రూ.5 వేల భృతి ఇస్తున్నాం. ఇందుకోసం ఇప్పటివరకు రూ.306 కోట్లు ఖర్చు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి పథకమే లేదు. ఈసారి ఆ భృతిని పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈలోగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేస్తాం.
బీఆర్ఎస్కు మైనార్టీలు ఎందుకు ఓటు వేయాలి?
మైనార్టీ సోదరులకు ముబారక్ (నమస్కరిస్తూ..) దేశంలోని చాలా రాష్ర్టాల్లో, ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ముస్లిం, మైనార్టీలపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో ముస్లింలను పరాయివారిగానే చూస్తున్నారు. ఒక్క తెలంగాణలో మాత్రమే సమాజమంతా ముస్లింలను కడుపులోపెట్టుకొని చూసుకుంటున్నది. తెలంగాణ అంటే హిందూ ముస్లిం భాయ్ భాయ్.. తెలంగాణ అంటే సర్వమతాల సమ్మేళనం.. తెలంగాణ అంటే భిన్నత్వంలో ఏకత్వం. మొత్తంగా తెలంగాణ.. గంగా జమునా తెహ్జీబ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాదిరిగా తెలంగాణలో మత ఘర్షణలు లేవు. కర్ఫ్యూల ఊసే లేదు. శాంతి భద్రతలతో తెలంగాణ వర్ధిల్లుతున్నది. మైనార్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది.
మైనార్టీ గురుకులాలతో మీరు సంతృప్తి చెందినట్లేనా?
ముమ్మాటికీ. ఎందుకంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కనీసం 10 మైనార్టీ గురుకులాలు కూడా లేవు. ప్రస్తుతం తెలంగాణలో 204 మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. వాటిలోని చదువుతున్న 1,30,560 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,152 కోట్లు ఖర్చు చేస్తున్నది. రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాలన్నీ జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. జాతీయ స్థాయి పరీక్షల్లో ఎంతో
మంది ర్యాంకులు సాధిస్తున్నారు. ఓవర్సీస్ పథకం కింద బీఆర్ఎస్ ప్రభుత్వం 3,224 మంది విద్యార్థులకు రూ.492.88 కోట్లు ఖర్చుచేసి విదేశాల్లో చదివిస్తున్నది.
వక్ఫ్ భూముల విషయంలో గందరగోళం ఉన్నదన్న మాట నిజమేనా?
అది కాంగ్రెస్ నేతలు కావాలని సృష్టించిన గందరగోళం. బీఆర్ఎస్ హయాంలో ఒక్క గజం భూమి కూడా ఆక్రమణకు గురికాలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వక్ఫ్ భూములను కాపాడేందుకు 22 (ఏ) జీవో తీసుకొచ్చింది. పత్రాలన్నీ కలెక్టర్లకు అప్పగించింది. బీఆర్ఎస్ హయాంలో దర్గాలను కూల్చివేశారని, వక్ఫ్ భూములను ఆక్రమించారని ఓ బ్లేడ్‌బ్యాచ్ తిరుగుతున్నది. ముస్లింలైనా, ముస్లిమేతురులైనా మసీదులను ధ్వంసం చేస్తే వెంటనే కేసులు పెట్టాం. వక్ఫ్ భూముల జోలికొస్తే తాట తీశాం. మా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి.
కాంగ్రెస్ పాలనలో విద్యా విధానం, నేటి విద్యా విధానంలో మీరు గమనించిన మార్పులు?
నాడు పేద ముస్లిం కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోపుడు బండ్లు పంపిణీ చేసింది. కానీ, వారి పిల్లల భవితకు మార్గం చూపలేదు. దీంతో తండ్రి తోలిన తోపుడు బండిని కొడుకు వాడాడు. దీనికి భిన్నంగా కేసీఆర్ ప్రభుత్వం గురుకులాల ద్వారా ఉచిత విద్యనందిస్తూ పేద ముస్లిం పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లు, ఫార్మసిస్టులను చేస్తున్నది. ఈ ఏడాది 11 మంది ఎంబీబీఎస్‌లో చేరారు. 143 మందికి బీడీఎస్ అడ్మిషన్లు వచ్చాయి. 1,500 మంది ఇంజినీరింగ్, ఫార్మసీ చదువుతున్నారు. ఇది మాకు చాలా గొప్ప విషయం. స్వయంగా అల్లాయే మా కోసం కేసీఆర్‌ను పంపారు.
చారిత్రక కట్టడాలపై కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నదని మీకు అనిపించడం లేదా?
ముస్లింల చారిత్రక కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలోనే పూర్వ వైభవం వచ్చింది. అయినా కొందరు నేతలు అబద్ధాలు వల్లెవేస్తున్నారు. ఉస్మానియా, అరమ్ మంజిల్, నిజామియా మెడికల్ కాలేజీ, మెటర్నిటీ హాస్పిటల్, ఉస్మాన్‌సాగర్, సఖల్ సాగర్ నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. వాటికి ప్రభుత్వమే ప్యాచ్‌వర్క్‌లు చేయించి కాపాడుతున్నది. కోకాపేట లాంటి ప్రాంతాల్లో పెద్ద దర్గాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
హోంశాఖ మంత్రిగా మైనార్టీలకు మీరిచ్చే సందేశం?
తెలంగాణలోని మైనార్టీ వర్గానికి నా విజ్ఞప్తి ఒక్కటే.. ఇది మన ప్రభుత్వం. మనల్ని నిరంతరం కంటికిరెప్పలా కాపడుతున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని చూడండి. అభివృద్ధిని బేరీజు వేయండి. రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, హజ్‌యాత్ర, దర్గాల అభివృద్ధి లాంటి ఎన్నో పనులు చేస్తున్నాం. మరెన్నో చేస్తాం. అందుకు మీరంతా అండగా నిలవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలి.
– రవికుమార్ తోటపల్లి, ఫొటోలు: చిన్న యాదిగిరిగౌడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

