సుబేదారి, ఆగస్టు 4 : బదిలీ మనస్తాపంతో వరంగల్ జిల్లా దుగ్గొండి మండ లం బలవంతపురం గ్రామానికి చెందిన హోంగార్డు దానం నాగరాజు(34) ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు తన సొంత మండలం దుగ్గొండి పోలీసు స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తించేవాడు. రెండు నెలల క్రితం జరిగిన బదిలీల్లో గీసుగొండకు బదిలీ అయ్యింది. ఇంటి నుంచి వెళ్లడానికి ఇబ్బంది అవుతుంది. దగ్గరకు బదిలీ చేయాలని నాగరాజు ఇటీవల హోంగార్డు విభాగం అధికారులకు మొరపెట్టుకున్నట్టు తెలిసింది. రెండు రోజుల క్రితం నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో కుటుంబ సభ్యులు హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. కాగా వరంగల్ పరిధిలో పనిచేస్తున్న 150 మందికిపైగా హోంగార్డులను రెండు నెలల క్రితం బదిలీ చేసినట్టు తెలిసింది. ఇష్టానుసారంగా బదిలీలు చేయడం వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.