హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆధీనంలో విద్యాశాఖకు సెలవుల ఫీవర్ పట్టుకున్నది. పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అంతా సెలవుల కోసం క్యూ కడుతున్నారు. కొందరు కిందిస్థాయి అధికారులైతే వామ్మో మేం పనిచేయలేం అంటున్నారు. రెండు రోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్ ఆర్జేడీ విజయలక్ష్మి నాలుగు నెలల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో సోమిరెడ్డికి ఆర్జేడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
హైదరాబాద్ డీఈవో రోహిణి సైతం సెలవుపై వెళ్లేందుకు అనుమతి కోరారు. పాఠశాల విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీతోపాటు మరో కొందరు ఆర్జేడీలు మేం పనిచేయలేం, తమను మరోస్థానానికి బదిలీచేయాలని మొరపెట్టుకుంటున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో ఓ అడిషనల్ డైరెక్టర్ సైతం తనను తప్పించాలని చా లా కాలంగా కోరుతున్నారు. బదిలీ చేయండి మహాప్రభో అంటున్నా రు. కొందరు నాన్ ఫోకల్లోని అధికారులు ఏదో తూతూమంత్రంగా పనిచేస్తూ నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితులతో సీఎం శాఖలో ఏంజరుగుతుందని చర్చిస్తున్నారు.
ఐఏఎస్ అధికారులు కూడా..
పైస్థాయి ఉన్నతాధికారులు కూడా సెలవుల మీద వెళుతున్నారు. దీంతో ఎవరు ఏ పోస్టులో ఉన్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. విద్యాశాఖ సెక్రటరీగా ఉన్న డాక్టర్ యోగితారాణా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. 45 రోజులపాటు చైల్డ్‌కేర్ లీవుపై వెళ్లారు. ఈ బాధ్యతలను శ్రీదేవసేనకు అప్పగించారు. ఆమె కూడా వ్యక్తిగత సెలవుపై వెళ్లగా ఆ బాధ్యతలను ఎన్ శ్రీధర్‌కు అప్పగించారు. శ్రీదేవసేన సెలవులో ఉన్నంత కాలం కళాశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బాధ్యతలను ఇంటర్ విద్యా డైరెక్టర్ కృష్ణ ఆదిత్యకు అప్పగించారు.
ఇటీవలే కృష్ణ ఆదిత్య సెలవులు ముగించుకుని విధుల్లో చేరారు. ఇంతకు విద్యాశాఖ సెక్రటరీ ఎవరన్నది గందరగోళానికి దారితీసింది. సీఎం సమీక్షల్లో యోగితారాణా విద్యాశాఖ సెక్రటరీగా పాల్గొనడం, అధికారిక ఉత్తర్వుల్లో శ్రీధర్ పేరు ఉండటంతో గందరగోళానికి దారితీసింది. యోగితారాణా సెలవులు ముగించుకుని సోమవారం విధుల్లో చేరనుండగా ఈ గందరగోళానికి తెరపడనున్నది. తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ 15 రోజుల సెలవుపై వెళ్లారు. ఈ స్థానంలో ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించలేదు. ఇది వరకు సీఎంవోలో విద్యాశాఖ సెక్రటరీని తప్పించారు. గతంలో మాణిక్‌రాజ్ కన్నన్ సీఎంవో కార్యదర్శిగా ఉండగా, ఈ బాధ్యతలను అజిత్‌రెడ్డికి అప్పగించారు.